గులాబీ జెండా ఎగరాలి | KTR Target Board Elections in Wards | Sakshi
Sakshi News home page

గులాబీ జెండా ఎగరాలి

Sep 5 2019 12:36 PM | Updated on Sep 5 2019 12:36 PM

KTR Target Board Elections in Wards - Sakshi

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కంటోన్మెంట్‌ నేతల భేటీ

కంటోన్మెంట్‌: త్వరలో జరగనున్న బోర్డు ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయాలని, ఈ మేరకు కృషి చేయాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ కంటోన్మెంట్‌ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న, సీనియర్‌ నేత మర్రి రాజశేఖరరెడ్డి నేతృత్వంలో బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, టీఎస్‌టీఎస్‌ చైర్మన్‌ బోర్డు సభ్యులు కేశవరెడ్డి, పాండుయాదవ్, లోకనాథం, బోర్డు మాజీ సభ్యులు వెంకట్రావు, ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కో– ఆప్షన్‌ సభ్యుడు నర్సింహ ముది రాజ్, కార్పొరేటర్‌ లాస్య నందిత, మోండా డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆకుల హరి కృష్ణ, పార్టీ సీనియర్‌ నేతలు టీఎన్‌ శ్రీనివాస్, పిట్ల నాగేశ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ నాలుగు నెలల్లో జరగనున్న బోర్డు ఎన్నికలకు నేతలు సర్వసన్నద్ధం కావాలని సూచించారు. ముఖ్యంగా పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల ను పక్కనపెట్టి ఐకమత్యంతో ముందుకెళ్లాలన్నారు. బహిరంగ వేదికల్లో బోర్డు సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మానుకోవాలని సూచించారు. గత బోర్డు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలవగా, ఎన్నికల అనంతరం మిగతా నలుగురు సైతం పార్టీలోనే చేరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులే గెలిచేలా తగి న వ్యూహాలు రూపొందించాలని సాయన్నకు సూచించారు. ఈ మేరకు గురువారం స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. 

పార్టీ గుర్తులతో ఎన్నికలకే మొగ్గు!
బోర్డు ఎన్నికల్లో ఈసారి పార్టీ గుర్తులతోనే ఎన్నికలు జరిగేలా చూడాలని కొందరు నేతలు ప్రస్తావించగా, ఈ మేరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే నెల 13న ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయంలో జరగనున్న సమావేశంలో బోర్డు ఎన్నికల అంశంపై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. బోర్డు ఎన్నికల్లో పార్టీ గుర్తులతో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌కు బీజేపీ కూడా సానుకూలంగా వ్యవహరించే అవకాశముందని స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌తో అన్నారు. 

బోర్డు అధికారుల అలసత్వంతోనే..
కంటోన్మెంట్‌ పరిధిలోని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, బోర్డు అధికారుల అలసత్వం వల్లే ఆయా సమస్యలు పెండింగ్‌లో పడుతున్నాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంటోన్మెంట్‌ జనలర్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మూడేళ్లుగా చెబుతున్నప్పటకీ బోర్డు అధికారులు తమ సంసిద్ధతను రాతపూర్వకంగా అందజేయడం లేదన్నారు. ఇక రూ.40 కోట్లు దాటిన టీపీటీ బకాయిల్లో కనీసం సగం తక్షణం విడుదలయ్యేలా చూడాలని బోర్డు సభ్యులు కోరారు. వెంటనే సంబంధిత అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్న కేటీఆర్‌ ఇటీవలే రూ.8 కోట్లు విడుదలయ్యాయని, త్వరలో మరో రూ.12 కోట్లు విడుదలవుతాయిన చెప్పారు. రామన్నకుంట సమస్య పరిష్కారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందన్నారు. బోర్డు  సభ్యులు ప్రత్యేక చొరవతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తూ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement