
సాక్షి, బెంగళూర్ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయిపై నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుష్టూ సుందర్ ప్రశంసలు గుప్పించారు. ఆయన ఓ గొప్ప నేతగానే కాదు.. మంచి పాలకుడు కూడా అందరికీ ఆదర్శమని ఆమె కొనియాడారు. బెంగళూర్‌లో శనివారం ‘కర్ణాటక పంచాయత్’ పేరిట ఇండియా టుడే నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
‘వాజ్‌పేయి గొప్ప విజన్ ఉన్న నేత. గొప్ప పాలకులలో ఆయన ఒకరని కాంగ్రెస్ కూడా భావిస్తుంది. సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తూ.. మతాన్ని ఆయన ఇంటి(బీజేపీ) నాలుగు గోడలకే పరిమితం చేశారు. ఆయన పాలనలో గో రక్ష పేరుతో హత్యలు జరగిన దాఖలాలు లేవు. పైగా ‘ఒక దేశం-ఒక మతం’ సిద్ధాంతాన్ని కూడా ప్రొత్సహించలేదు. అలాంటి వ్యక్తిని సొంత పార్టీలోని కొందరు వ్యక్తులే క్రియాశీల రాజకీయాలకు దూరం చేసేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక దేశం.. ఒక మతం పేరిట బీజేపీ చెలరేగిపోతోంది’ అని కుష్బూ పేర్కొన్నారు.
ఇక కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ‘నాగరికత, సభ్యత అంటే హిందూయిజం’ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని.. దానికి ఏ ఇజం కూడా ప్రత్యేకం కాదని ఆమె పేర్కొన్నారు.