
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ నిమ్స్ వద్ద జరిగిన ప్రజా పంచా యతీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన సీఎం కేసీఆర్ మాయమాటలతో గారడీ చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో అందుతున్న వైద్యంపై నమ్మకం లేకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్స్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కేంద్రం ఎయిమ్స్‌ను మంజూరు చేస్తే ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదన్నారు. నిమ్స్‌ను షూటింగ్‌లకు ఇస్తూ ఆదాయ వనరుగా మార్చుకునే దుస్థితికి చేరిందని దుయ్యబట్టారు. గుజరాత్ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటిస్తారని లక్ష్మణ్ చెప్పారు.
లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
సభ జరుగుతుండగానే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో షామియానాలు, స్టేజీ పై కప్పు కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన నాయకులు తలో దిక్కు పరుగుతీశారు. అయితే కార్యకర్తలు లక్ష్మణ్‌ను సురక్షితంగా బయటికి తీసుకురావడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పోచంపల్లి మండలం ఇంద్రియాలకు చెందిన శ్రీనివాస్, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment