
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం రోజున మోదీ, నితీశ్‌లు పట్నాలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సంకల్ప ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సభ వేదికగా మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, ఈ సభను ఉద్దేశించి ట్విటర్‌లో స్పందించిన లాలూ.. మోదీ, నితీశ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.
గాంధీ మైదాన్‌లో సభ నిర్వహించడానికి నితీశ్ నెలల తరబడి ప్రభుత్వ యంత్రాగాన్ని వాడుకున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారని మండిపడ్డారు. సభను విజయవంతం చేసేందుకు మోదీ, నితీష్ చాలా కష్టపడ్డారని.. అయిన జనాలు రాలేదని వ్యాఖ్యానించారు. రోడ్డు పక్కన ఉన్న పాన్ షాప్ దగ్గర కూడా ఆ మాత్రం జనాలు ఉంటారని సెటైర్లు వేశారు. సభ నిర్వహించిన వారు కెమెరాలను తెలివిగా వాడుతూ.. అక్కడికి ఎంతో మంది వచ్చినట్టు చిత్రీకరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా నేతలు ప్రజలను మోసం చేయకుండా.. సభకు సంబంధించిన వాస్తవ దృశ్యాలను వారి ముందుంచాలని అన్నారు.