
సాక్షి, చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఆయన సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మార్పు తథ్యం అని ఆమె అభిప్రాయపడ్డారు. లతా రజనీకాంత్ శ్రీ దయా ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చెన్నై మైలాపూర్‌లోని రష్యన్ కల్చరల్ హాలులో మంగళవారం శ్రీ దయా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను వివరిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె ఫౌండేషన్ సేవలను వివరించారు.
పలు ఎన్‌జీఓ సంస్థలతో కలిసి ఈ సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని లతా రజనీకాంత్ తెలిపారు. స్థానిక వాల్టక్స్ రోడ్డులో జీవించే కుటుంబాలను దత్తత తీసుకుందని తెలిపారు. ఈ సందర్భంగా రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ తన భర్త రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని చెప్పారు. ఆయన త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మంచి జరగుతుందని, అందుకు పలు పథకాలను సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని, సమాజంలో మార్పు వస్తుందని లతా రజనీకాంత్ వ్యాఖ్యానించారు.