సాక్షి, హైదరాబాద్: మోదీ గ్రాఫ్ పడిపోతోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 130 సీట్లే వస్తాయంటూ పార్టీ అంతర్గత సర్వే నివేదిక పేరుతో పత్రికల్లో ప్రచురితమైన కథనం అవాస్తవమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. అంతర్గత సర్వే పేరుతో జరుగుతున్న ఈ ప్రచారం రాజకీయ కుట్ర అని ఆరోపించారు. దైనిక్ భాస్కర్ సర్వే పేరిట ఈ ప్రచారం జరిగిందని, దేశంలో ఏ పత్రికలూ ఈ అంశాన్ని ప్రచురించలేదని, కేవలం మన రాష్ట్రంలోని తెలుగు పత్రికలు మాత్రమే ప్రచురించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయమై కేంద్ర కార్యాలయాన్ని సంప్రదిస్తే, పార్టీపరంగా అలాంటి సర్వే ఏదీ జరపలేదని తేల్చిచెప్పారని, దైనిక్ భాస్కర్ సైట్‌లో సైతం ఈ అంశానికి సంబంధించి వార్తలేమీ లేనట్లు వెల్లడైందని తెలిపారు. మోదీని ఎదుర్కొనలేక కొందరు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని, మోదీ ప్రాభవం రోజురోజుకు పెరుగుతుంటే జీర్ణించుకోలేని కొన్ని దుష్టశక్తులు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment