లక్ష్మీ పార్వతి
పెద్దాపురం: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. పెద్దాపురంలో విలేకరులతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ బాబులేనని విమర్శించారు. అభివృద్ధి ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనుల్లో రూ.37 వేల కోట్లు దారి మళ్లాయని కాగ్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 45 లక్షల హెక్టార్లలో పంట సంవృద్ధిగా సాగితే..చంద్రబాబు హయాంలో 30 లక్షల హెక్టార్లకు వ్యవసాయం పడిపోయిందని వెల్లడించారు.
చంద్రబాబు ఇస్తానన్న కాపు రిజర్వేషన్లు అనేవి కంటి తుడుపు చర్యలేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే హత్యా రాజకీయాలు జరిగాయని అన్నారు. 19 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హత్య చేయించడం, అక్రమ కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి అమరావతికి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొని వ్యవసాయం గురించి మాట్లాడతాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులలో రూ.12 వేల 350 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అరకు మావోయిస్టుల కాల్పుల ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాక్యానించారు. ఆంధ్రలో ఉన్న ఇంటెలిజెన్స్‌ను హైదరాబాద్‌లో వాడుకోవడం వల్లే ఇక్కడ మావోయిస్టుల సమాచారం తెలుసుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారని విమర్శించారు. రాజధాని నిర్మాణంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment