సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో జట్టు కట్టిన పార్టీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది. పూర్వ ఆదిలాబాద్ పరిధిలోని పది సీట్లలో తొమ్మిదింట కాంగ్రెస్ పోటీ చేయడం దాదాపు ఖరారైంది. మిత్రులకు బెల్లంపల్లి సీటు ఇచ్చేందుకు మాత్రమే కాంగ్రెస్ సుముఖతతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ సీపీఐతోపాటు టీడీపీ, టీజేఎస్ కూడా మంచిర్యాలను కోరుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీల స్థానిక నాయకత్వాలు తమ పార్టీ రాష్ట్ర శాఖలకు నివేదించాయి. అదనంగా టీడీపీ సిర్పూరు, టీజేఎస్ చెన్నూరులో పోటీకి ఆసక్తితో ఉన్నాయి. గెలిచే సీట్లలోనే పోటీ చేయాలన్న గీటురాయి పెట్టుకున్న నేపథ్యంలో పొత్తు లపై ఉమ్మడి నిర్ణయం వెలువడేంత వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.
రాష్ట్రం యూనిట్‌గా సీట్ల పంపకం
రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్ పార్టీలు ఇప్పటికే తాము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల వివరాలను కాంగ్రెస్ పార్టీకి అందజేశాయి. తెలుగుదేశం 19, టీజేఎస్ 25, సీపీఐ 12 సీట్లను తమకు కేటాయించాలని కోరినట్లు సమాచారం. ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కడుంటే ఆ పార్టీ అభ్యర్థి అక్కడే పోటీ చేయాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తోటి మిత్రుల ముందుంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీకి 15 నుంచి 19, టీజేఎస్, సీపీఐ పార్టీలకు మూడు నుంచి ఐదు సీట్ల వరకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం యూనిట్‌గా సీట్ల పంపకాలు ఉంటుండడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పదింట కేవలం ఒక్క సీటు మాత్రమే మిత్రపక్షాలకు వదిలేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ ఒక్క సీటు ఎవరికి.. ఎక్కడ దక్కుతుందో తెలియక నాలుగు పార్టీల నేతలు ఉత్కంఠతతో ఉన్నారు.
బెల్లంపల్లికి బదులు మంచిర్యాలపై సీపీఐ పట్టు
బెల్లంపల్లి నియోజకవర్గంలో 2009లో మహాకూటమి అభ్యర్థిగా గుండా మల్లేష్ విజయం సాధించారు. ఆసిఫాబాద్ నుంచి విడిబడి అప్పుడు కొత్తగా ఏర్పాటైన బెల్లంపల్లిలో సీపీఐకి పెద్దగా యంత్రాంగం లేకపోయినా, టీఆర్‌ఎస్, టీడీపీ ఓట్లు భారీగా మల్లేష్‌కు పోలవడంతో ఆయన విజయం సాధించారు. అదే గుండా మల్లేష్ 2009లో భారీ తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. గుండా మల్లేష్ కూడా తనకు ఈసారి పోటీ చేయడం ఇష్టం లేదని పార్టీకి తెలియజేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ బెల్లంపల్లికి బదులు మంచిర్యాల సీటుపై కన్నేసింది. పార్టీ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ను బీసీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని యోచిస్తోంది. సీపీఐ కాంగ్రెస్‌కు ఇచ్చిన జాబితాలో మంచిర్యాల పేరుంది. సీపీఐకి నాలుగు సీట్లు పోటీ చేసే అవకాశం వస్తే మంచిర్యాల ఆ జాబితాలో ఉంటుందని కలవేన శంకర్ ధీమాతో ఉన్నారు. సీపీఐకి పట్టున్న నల్లగొండ, కరీంనగర్‌లలో మూడు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల మీద ఆశలు ఏమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
మంచిర్యాల, చెన్నూరులపై టీజేఎస్ నజర్
టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరిగిపోయిన నేపథ్యంలో యువకులు, ఉద్యోగులు, తెలంగాణ వాదులు కోదండరాం నేతృత్వలోని తెలంగాణ జన సమితి వైపు చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోదండరాం స్వస్థలమైన మంచిర్యాల జిల్లాలో రెండు సీట్లను ఆ పార్టీ కోరుతోంది. మంచిర్యాలతోపాటు ఇటీవల వివాదాస్పద నియోజకవర్గంగా రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కిన చెన్నూరులో కూడా తమ అభ్యర్థినే నిలపాలని కోదండరాం ఆలోచన. ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌కు ఇచ్చిన పోటీ చేసే సీట్ల జాబితాలో ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నట్లు తెలిసింది. మంచిర్యాల నుంచి కోదండరాం పేరు ప్రచారంలో ఉంది. ఆయన కాని పక్షంలో గురిజాల రవీందర్‌రావు, చెన్నూరు నుంచి పోడేటి సంజీవ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
మంచిర్యాల, సిర్పూరులపై టీడీపీ
కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం స్థానిక నాయకత్వం ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లు కోరుతోంది. ఒకప్పటి పార్టీ కంచుకోట అయిన ఈ జిల్లాలో మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు గోపతి మల్లేష్, సిర్పూరు నుంచి రాష్ట్ర నాయకుడు జి.బుచ్చిలింగం ఆసక్తి చూపుతున్నారు. పార్టీ వారం క్రితం కాంగ్రెస్‌కు ఇచ్చిన 19 మందితో కూడిన జాబితాలో ఈ నియోజకవర్గాల పేర్లు లేవు. టీడీపీ బలంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి 19 సీట్లు కావాలని కోరింది.
మంచిర్యాల కాంగ్రెస్‌దే అంటున్న కొక్కిరాల
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఉప సంఘం చైర్మన్‌గా కీలక బాధ్యతలు పొందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి నుంచి పోటీ ఉన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకే సీటు ఖాయమని చెపుతూ వివిధ మార్గాల్లో జనం వద్దకు వెళ్తున్నారు. మంచిర్యాల సీటును మిత్రపక్షాలకు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన వాదన. సీపీఐకి ఇవ్వాల్సి వస్తే బెల్లంపల్లి ఒక్కటే అవకాశమని, మిగతా 9 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసి తీరుతుందని ఆయన చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment