సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: మహాకూటమి పొత్తుల లెక్కలు తేలకపోయినా... కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఉమ్మడి జిల్లా పర్యటన మాత్రం ఖరారైంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, కో చైర్‌పర్సన్ డీకే.అరుణ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రచారం సాగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్‌లలో మినహా ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. భైంసాలో ఇటీవలే రాహుల్‌గాంధీ ప్రచారసభను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ముథోల్, నిర్మల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సాగించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా తయారైంది. అయితే ఇప్పటివరకు మహాకూటమిలో పొత్తులపైన స్పష్టత లేకపోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.
నవంబర్ ఫస్ట్‌కు ముందే స్పష్టత!
మహాకూటమిలో పొత్తుల అంశాన్ని నెలరోజులుగా నానుస్తూ వస్తున్న కాంగ్రెస్ వైఖరి పట్ల ఇప్పటికే టీజేఎస్, సీపీఐ తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మరో అడుగు ముందుకేసి రెండురోజుల్లో తేల్చకపోతే మొదటి విడతగా తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తానని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. పొత్తుల్లో తమకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గితే ఒప్పుకోమని, పార్టీ గుర్తుల మీద పోటీ చేస్తారని సీపీఐ కూడా హెచ్చరించింది. అయినా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ, కోర్ కమిటీ సమావేశాలతోనే కాలం వెల్లుబుచ్చుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సోమవారం కూడా స్క్రీనింగ్ కమిటీతో కోర్ కమిటీ భేటీ అయింది. ఇప్పటికే ఖరారు చేసిన జాబితాను ప్రకటించాలని కోర్ కమిటీలో నేతలు కోరగా, పొత్తులు ఖరారు కాకుండా అభ్యర్థులను ప్రకటించడం వీలుకాదని స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లోనే పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లా భట్టి వర్గంలో జోష్
పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అండదండలతో పార్టీ టికెట్టు ఆశిస్తున్న వారంతా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా ఉండగా, మహేశ్వర్‌రెడ్డిని వ్యతిరేకించే వారంతా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నాయకత్వంలో భట్టి విక్రమార్క వర్గంగా టికెట్లు ఆశిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్, కో చైర్‌పర్సన్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే భట్టి, డీకేలకే అవకాశం లభించడం ఉమ్మడి జిల్లాలోని ప్రేంసాగర్‌రావు వర్గానికి ఊపునిచ్చింది. నవం»బర్ ఒకటి నుంచి నాలుగోతేదీ వరకు సాగే పర్యటనలో భట్టి వర్గీయులే ప్రముఖంగా కనిపించే అవకాశం ఉంది. అయితే ప్రచార కమిటీ పర్యటన కాబట్టి నాయకులంతా హాజరవుతారని, గ్రూపులతో సంబంధం ఉండదని ప్రేంసాగర్‌రావు సాక్షితో మాట్లాడుతూ చెప్పారు.
హస్తవాసి దక్కేదెవరికో...
పొత్తుల లెక్కలు తేలకపోయినా పది నియోజకవర్గాలలో కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. అయితే డీసీసీ, పీసీసీల స్థాయిలో వడబోత ముగిసింది. స్క్రీనింగ్ కమిటీ కూడా వేర్వేరు సర్వేలు, సలహాలు, సూచనలతో పాటు వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం కోర్‌కమిటీ సమావేశం తరువాత ఏఐసీసీకి అభ్యర్థుల జాబితాను పంపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు మినహా ఎవరూ ఆశావహులు లేరు. ముథోల్‌లో రామారావు పటేల్, నారా యణరావు పటేల్‌తో పాటు ఎన్నారై పి.విజయ్‌కుమార్‌రెడ్డి కూడా టికెట్టు రేసులో ఉన్నారు. వీరిలో ప్రజలతో సంబంధాలు మెరుగ్గా ఉన్న నేతనే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థిత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. బోథ్‌లో సోయం బాపూరావు, అనిల్‌జాదవ్‌లలో ఎస్టీల్లోని రెండు వర్గాలను సమతుల్యం చేసే ప్రక్రియలోనే అభ్యర్థి ఖరారు కానున్నారు. ఆదిలాబాద్‌లో సామాజిక సర్థుబాటుతో పాటు మంత్రి రామన్నకు గట్టి పోటీనిచ్చే మహిళా అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తే గండ్రత్ సుజా తకు అవకాశం దక్కనుంది.
ఖానాపూర్‌లో రాథోడ్ రమేష్ అభ్యర్థిత్వంపై హామీతోనే కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఆయనకే సీటు ఖాయమనే ప్రచారం ఉంది. సిర్పూరులో హరీష్‌బాబు, రావి శ్రీనివాస్ మధ్య పోటీలో హరీష్ వైపే స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపినట్లు సమాచారం. చెన్నూరులో బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ ఎవరికి వారే ప్రయత్నాలు చేసినా, స్క్రీనింగ్ కమిటీ వెంకటేశ్ నేతను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లిలో గద్దర్ తనయుడు సూర్యకిరణ్‌ను తెరపైకి తెచ్చినా, సీపీఐ పొత్తులో సీటు గల్లంతయ్యే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంచిర్యాలలో టికెట్టు తనదేనని కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ధీమాతో ఉన్నారు. అయితే స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన వారే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. రెండు రోజుల్లో జాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment