సాక్షి, ముంబై : సొంత పార్టీపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నానా పటోలే బీజేపీకి, ఎంపీ పదవికి గుడ్ బై చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగానే తాను లోక్‌సభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పైనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
‘‘గత కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. అన్నదాతల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి నేను ఒకే పార్టీకి చెందిన వారం కావొచ్చు. మంచి స్నేహితులమే అయి ఉండొచ్చు. అయినా తప్పు చేస్తే వెలెత్తి చూపి, అది సరిదిద్దుకునే దాకా ఫడ్నవిస్‌ను వదలను’’ అని పటోలే ఆ సమయంలో వ్యాఖ్యానించారు.
ఆయన ప్రస్తుతం గోండియా నియోజకవర్గానికి ఎంపీగా లోక్‌సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ మధ్యే విదర్భ ప్రాంతంలోని రైతుల డిమాండ్ సాధనకై బీజేపీ నేత యశ్వంత్ సిన్హా దీక్ష చేపట్టగా.. దానికి హాజరైన నానా పటోలే ఫడ్నవిస్ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment