సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో 50:50 ఫార్యులాను కచ్చితంగా అమలు చేయడాలని బీజేపీని శివసేన కోరుతున్న విషయం తెలిసిందే. అయితే అందుకు బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల ఏడో తేదీలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుందని బీజేపీ నిన్న ప్రకటన చేసింది. అంతేకాకుండా ఈ నెల 8న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ పట్టువీడకపోవడంతో పాటు సీఎం ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకోవడంతో శివసేన మాటలు తూటాలు పేల్చుతోంది.
కాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు అవుతున్నా... కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఇంతవరకూ అడుగు ముందుకు పడలేదు. అందుకు ప్రధాన కారణం శివసేన 50:50 ఫార్ములాను అమలు చేయాలని పట్టుబట్టడమే. దీంతో బీజేపీ సీఎం పదవే కాకుండా కీలకమైన శాఖలు కూడా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. దీంతో మిత్ర పక్షాల మధ్య వివాదం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. బీజేపీ పైచేయి చాటుకునే ప్రయత్నం చేస్తుండటంతో శివసేన కూడా మరింత మొండిగా ప్రవర్తిస్తోంది. పుట్టుకతోనే ఎవరు ముఖ్యమంత్రి పదవిని వెంట తీసుకురారని యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే బీజేపీకి చురకలంటించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరే ప్రమాదం ఏర్పడింది.
చదవండి: ‘శివ’సైనికుడే సీఎం
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత సుధీర్ మృదుగంటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడువులోకగా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీలు ముందుకు రాకుంటే రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గమన్నారు. బీజేపీ-శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలు ఏ పార్టీకి తగిన మద్దతు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రత్యామ‍్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే బీజేపీ-శివసేన కలిపి పని చేయడమే మేలు అని అన్నారు.
మరోవైపు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ముఖ్య ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ బిజెపి, శివసేన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే, తమ పార్టీ ప్రత్యామ్నాయం ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. మృదుగంటివార్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ-శివసేనలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. అయితే అందుకు ఆ పార్టీలు విఫలమైతే మేము ప్రత్యామ్నాయాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment