
ముంబై: మహారాష్ట్రలో ట్విస్ట్‌కు కారణమైన అజిత్ పవార్‌ను బుజ్జగించేందుకు ఎన్సీపీ చేసిన ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. అజిత్‌తో చర్చలు జరిపేందుకు శరద్ పవార్ దూతగా వెళ్లిన ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్ పాటిల్ తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. ఆయనతో చర్చలు జరిపేందుకు అజిత్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను బీజేపీతోనే ఉన్నట్లు అజిత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన పాలన అందించేందుకు కృషిచేస్తానంటూ మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ట్విచ్ చేశారు.
మరోవైపు బీజేపీ బలపరీక్షలో నెగ్గేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు తమ ఎమ్మెల్యేలను బీజేపీ వలకు చిక్కకుండా హోటళ్లకు తరలించాయి. వారు ఉన్న హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శివసేన ఎమ్మెల్యేలు ఉన్న లలిత్ హోటల్ వద్ద రెండు పోసీస్ స్టేషన్ల సిబ్బంది కాపలా ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న హోటళ్లలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. వచ్చిపోయే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు.
మరోవైపు రెనోసా హోటల్‌లో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని వారికి వివరించినట్టు తెలుస్తోంది. 49 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని ఎన్సీపీ నేతలు చెప్తున్నారు. ఢిల్లీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగొస్తారని పేర్కొన్నారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీలో 50 మంది సభ్యులు శరద్ వెంటే ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేవలం నలుగురు మాత్రమే అజిత్ వెంట ఉన్నారని వారు కూడా వెనక్కి రాకపోతే అనర్హత వేటు తప్పదని శరద్ ఇదివరకే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment