సాక్షి, విజయవాడ: రాజధానుల అంశంలో తెలుగుదేశం దేశం పార్టీ మూడు ముక్కలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు మాటలకు... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఘాటు విమర్శలు చేశారు. రాయలసీమలోని టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తామంటుంటే బాబు, ఆయన కొడుకు మాత్రం రాద్ధాంతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజధానిపై పూర్తిస్థాయి నిర్ణయం జరగలేదని పేర్కొన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. వైఎస్సార్‌సీపీ రైతు పక్షపాత పార్టీ అని స్పష్టం చేశారు. పాలన వికేంద్రీకరణ జరగాలని సీఎం జగన్ అసెంబ్లీ లో సూచించారని.. ఆయన నిర్ణయం అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైనదిగా ఉంటుందని పేర్కొన్నారు.
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి..
గత ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడమైనా నిర్మించారా అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. రాజధాని పేరిట టీడీపీ నాయకులు దాదాపు నాలుగు వేల ఎకరాల మేర ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వారి గురించి అసెంబ్లీలో వివరించారన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు ఉద్యమాల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేసి.. రైతులు చేసే ఆందోళన వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులు, కుట్రలు సాగనివ్వమని... రాజధాని రైతులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వారి మాటలకు పొంతన లేదు..
‘విశాఖపట్నంలో రాజధాని అంటే అక్కడి టీడీపీ నాయకులు స్వాగతిస్తామంటారు. రాయలసీమ టీడీపీ నాయకులు మేము కూడా స్వాగతిస్తామంటారు. అయితే రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతల మాటలకు చంద్రబాబు మాటలకు ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం మానుకోవాలి’ టీడీపీ నేతల తీరును విష్ణు విమర్శించారు. బీజేపీ నాయకులు సైతం పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని.. రైతులకు అన్ని విధాలాలుగా న్యాయం చేస్తామని విష్ణు పేర్కొన్నారు. రాజధాని అంశంలో అన్ని ప్రాంతాల మేధావులు అభిప్రాయాలు స్వీకరించి...అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment