సాక్షి, కోల్‌కతా : దుర్గా నిమజ్జనంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదం కావటం తెలిసిందే. మొహర్రం ఊరేగింపు, నిమజ్జనం ఒకే రోజున చేపడితే మత కలహాలు చెలరేగుతాయంటూ నిమజ్జనంపై గతంలో మమత కొన్ని ఆంక్షలు విధించారు. అయితే హైకోర్టు జోక్యంతో చివరకు ఆ ఆదేశాలు పక్కన పెట్టేశారనుకోండి.
ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఇప్పుడు మరో అవతారం ఎత్తారు. రచయితగా మారి ఓ పాట రాసేశారు. కోల్‌కతాలో దుర్గా మాతకు కమ్యూనిటీ పూజలు సాధారణంగా జరిగేవే. ఈ క్రమంలో సురుచి సంఘ పూజ కోసం మమతా పాట రాశారు. భిన్న మతాల ముత్యాలతో దేశ ఐకమత్యం.. అంటూ అద్భుతమైన సాహిత్యంతో రాయగా.. సింగర్ శ్రేయా ఘోషల్ స్వరాన్నిఅందించారు. ఇక ప్రముఖ బెంగాలీ సింగర్ జీత్ గంగూలీ సంగీతాన్ని అందించటం విశేషం.
పూర్తి పాటను తన ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో మమత పోస్ట్ చేశారు. సురుచి సంఘ కోసం గతంలో కూడా దీదీ ఓసారి పాట రాయటం విశేషం. వివిధ కులాల వారు నిర్వహించే పూజల్లో ఉత్తమ పాటను ఎంపిక చేసిన వారికి అవార్డు అందించటం ఆనవాయితీగా వస్తోంది. కోల్‌కతా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే కార్యక్రమాల్లో సురుచి సంఘ్‌తోపాటు త్రిధార సమ్మిళని, కుమార్టూలి సర్బోజోనిన్ సంఘాలు ఆ పోటీల్లో ప్రధానంగా నిలుస్తుంటాయి.