ఇటీవల ముగిసిన దుర్గా పూజ ఉత్సవం అక్కడి రెస్టారెంట్‌లకు కాసులు కురిపించింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్‌లో ముఖ్యంగా కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇళ్లలో సంప్రదాయ పిండివంటలతో పాటు పిల్లాపాపలతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ప్రత్యేకమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
ఆరు రోజుల్లో రూ. 1,100 కోట్లు
కోల్‌కతా నగరంలోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు దసరా ఉత్సవాల సందర్భంగా ఆరు రోజుల్లో రూ. 1,100 కోట్లను ఆర్జించాయి. గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే ఈ సారి 20 శాతం అధికంగా వచ్చిందని ఈస్ట్రన్ ఇండియా హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపింది.
కోవిడ్ సంక్షోభం అనంతరం అన్ని అడ్డంకులు తొలగిపోయిన తర్వాత ఇది రెండవ దుర్గా పూజ. దశమి వరకు ఆరు రోజుల పాటు తెల్లవారుజామున 3 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్‌లలో కస్టమర్లు ఆహారం ఆస్వాదిస్తూ కనిపించారని ఈస్ట్రన్ ఇండియా హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదేష్ పొద్దార్ తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ఆరు రోజుల్లో నగరంలోని రెస్టారెంట్లు రూ. 1,100 కోట్ల వ్యాపారం చేశాయని ఆయన పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 20-25 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment