కోల్‌కత్తా : ఢిల్లీలో జనవరి 13న జరగనున్న విపక్షాల భేటీకి తను దూరంగా ఉండనున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. సీఏఏపై ఒంటరిగానే పోరు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం జరిగిన భారత్ బంద్‌లో భాగంగా కాంగ్రెస్‌తోపాటు లెఫ్ట్ పార్టీలు బెంగాల్‌లో తమ ప్రభుత్వంపై దాడి చేయడంపై మమత ఆగ్రహంగా ఉన్నారు. బంద్ సందర్భంగా బెంగాల్‌లో జరిగిన హింసపై మమత తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ద్వంద వైఖరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే మమత గురువారం మాట్లాడుతూ.. ‘జనవరి 13న సోనియా గాంధీ పిలుపు మేరకు జరిగే విపక్షాల భేటీని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే బుధవారం బెంగాల్‌లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పాల్పడిన హింసకు నేను మద్దతు తెలుపలేను’ అని పేర్కొన్నారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలతోపాటు ప్రతిపక్షాలు మాత్రం తమ పార్టీలకు చెందిన నాయకులను ఇబ్బంది పెట్టేందుకే టీఎంసీ హింసను ప్రోత్సహించిందని ఆరోపించారు.
ఒకవేళ మమత కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తే.. బెంగాల్‌కు వచ్చేసరికి ఆ పార్టీలే ఆమెకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇది చాలా కాలంగా మమతను ఇబ్బంది పెడుతున్న విషయం. కాగా, యూనివర్సిటీలలో జరుగుతన్న హింసతోపాటు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆందోళనలపై చర్చించడానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్షాల భేటీకి పిలుపునిచ్చారు. సోనియా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశాన్ని విజయవంతరం చేయడానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఈ భేటీకి సంబంధించి సోనియా ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment