
చరిత్ర ఆమెకు ఎంతో ఇష్టమైనసబ్జెక్ట్. అందులో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అదే చరిత్రను బెంగాల్‌లో సృష్టించారు. 33 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించి.. ‘కాలం మారింది కామ్రేడ్స్’ అని నినదించారు. అధికార దర్పంతో ‘ఇప్పుడు చరిత్ర అడక్కు. చెప్పింది చెయ్యి’ అంటూ కన్నెర్ర చేస్తున్నారు. తూటాల్లాంటి మాటలు విసురుతూ, వీధి పోరాటాలకు దిగుతూ తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేశారు. ఆమే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.
పెళ్లి చేసుకోకుండా ప్రజలకే జీవితం అంకితం చేసిన మమతాబెనర్జీని అభిమానులు దీదీ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అస్మదీయులపై ఎంతో మమతను కురిపించే ఆమె, గిట్టనివాళ్లపై నిప్పులు కురిపించగలరు. శారదా చిట్ ఫండ్స్, రోజ్‌వ్యాలీ పోంజి పథకాలు ఆమె ప్రభుత్వం మెడకు చుట్టుకున్నా అదరలేదు. బెదరలేదు. కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్ ఈ చిట్‌ఫండ్ కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేస్తున్నారంటూ ఆరోపణలతో అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారుల్ని అడ్డుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సొంత పోలీసు బలగంతో వారిని అరెస్ట్ చేయించారు. మరే ముఖ్యమంత్రికీ లేని ధైర్య సాహసాలను మమత ప్రదర్శించారు. ఆయనపై ఈగవాలితే సహించేది లేదంటూ కేంద్రానికి గట్టి వార్నింగ్‌లే ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో ‘నువ్వెంత అంటే నువ్వెంత?’ అనే స్థాయికి వెళ్లారు. మాతృసంస్థ కాంగ్రెస్‌ను విడిచి వేరు కుంపటి పెట్టాక తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించారు. ఆ ఇమేజ్‌తోనే ప్రధాని పదవి వరిస్తుందన్న ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. అందుకు తగినట్టుగా రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. మరేపార్టీ చేయని విధంగా ఏకంగా మహిళలకు 41 శాతం లోక్‌సభ టిక్కెట్లను ఇచ్చి రికార్డు సృష్టించారు. దటీజ్ దీదీ. పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన ఆమెలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పద్యాలు రాస్తారు. పెయింటింగ్‌లు గీస్తారు. ఆ చిత్రాలు ఎలా ఉన్నా సరే కార్యకర్తలు వాటిని అమ్మి పార్టీకి డబ్బులు తెచ్చి తీరవలసిందే.
♦ కోల్‌కతాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1955, జనవరి 5న పుట్టారు.
♦ కాలేజీ రోజుల నుంచి రాజకీయాలపై ఆసక్తి మెండు. యువతిగా ఉండగానే కాంగ్రెస్ గూటికి చేరారు.
♦ 1984 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసి సోమ్‌నాథ్ ఛటర్జీ వంటి దిగ్గజాన్ని ఓడించి లోక్‌సభలో అడుగు పెట్టారు. అంత గొప్ప నేతని ఓడించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
♦ రాజకీయంగా ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. 1989 ఎన్నికల్లో ఓడిపోయారు, 1991లో మళ్లీ నెగ్గారు.
♦ 1997లో కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టి 1998 జనవరి 1న తృణమూల్ కాంగ్రెస్‌ని స్థాపించారు. అప్పట్నుంచి 2009 సార్వత్రిక ఎన్నికల వరకు గెలుస్తూ వచ్చారు. అటు యూపీఏ, ఇటు ఎన్డీయే తనకు ఎవరు ప్రాధాన్యతినిస్తే అటువైపే ఉండేవారు. రెండుసార్లు రైల్వే మంత్రిగా పనిచేశారు. సొంత రాష్ట్రం బెంగాల్‌పై మమత చూపించి విమర్శలూ ఎదుర్కొన్నారు.
♦ సింగూర్, నందిగ్రామ్ ఆందోళనలతో బెంగాల్‌లో దీదీ పేరు మారుమోగిపోయింది
♦ 2011, 2016 సంవత్సరాల్లో వరసగా అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గారు.
♦ గత లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 34 స్థానాలు గెలవడం అంత ఆషామాషీ విజయం కాదు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయి ఉంటే ఏదైనా జరిగే ఉండేదని, ప్రధాని కావాలన్న ఆమెఆశలు ఫలించి ఉండేవన్నఅభిప్రాయాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి.
♦ పశ్చిమబెంగాల్‌లో 42లోక్‌సభ స్థానాలు ఉండడంతో ఈ ఎన్నికల్లోనూ అత్యంత కీలక శక్తిగాఅవతరించారు. ఈసారి ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాదన్న అంచనాలు ఉండడంతో ఎలాగైనా ఢిల్లీలో చక్రం తిప్పేలా వ్యూహాలు పన్నుతున్నారు.