
కోల్‌కత్తా : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోగల శక్తి బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మాత్రమే ఉందని మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఆదివారం కోల్‌కత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మమత నాయకత్వ లక్షణాలను కొనియాడారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయగల సత్తా ఉన్న నాయకురాలు మమత బెనర్జీ అని సిన్హా అన్నారు. రాజకీయ చతురత, ధైర్యం ఉన్న నాయకురాలనీ, దేశ ప్రధాని కావడానికి ఆమెకు మంచి నాయకత్వ లక్షణాలున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటని, జాతీయ స్థాయి రాజకీయాల్లో తృణమూల్ ప్రభావం చూపగలదని సిన్హా పేర్కొన్నారు.
పార్లమెంటరీ వ్యవస్థలో ఎంతో కీలకమైన మంత్రిమండలిని మోదీ పక్కన పెట్టారని, మంత్రులకు కూడా తెలియకుండా కొన్ని నిర్ణయాలు ఆయన సొంతగా తీసుకుంటున్నారని ఆరోపించారు. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మమత కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అనేకపార్టీల జాతీయ నేతలతో చర్చలు జరిపిన మమత, జనవరిలో బెంగాల్‌లో జరిగే భారీ ర్యాలీకి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.