సాక్షి, న్యూఢిల్లీ : ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని కేంద్ర మంత్రి మేనకా గాంధీ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశానికి ప్రధాని కాలేరని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేయడంపై స్పందిస్తూ.. ఏ వ్యక్తి అయినా ఎన్నికల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ప్రచారం గురించి మాట్లాడుతూ.. ఆమె ప్రచారం వల్ల మా పార్టీపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపారు.
మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు గతంలో వరుసగా ఫిలిబిత్, సుల్తాన్‌పూర్‌ల నుంచి పోటీ చేయగా.. ఈ సారి వారి స్ధానాలను పరస్పరం మార్పు చేశారు.ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త సంజయ్ గాంధీ రెండు సార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో నా కుమారుడు వరుణ్ గాంధీ కూడా విజయం సాధించారు. ఇక ఈ సారి నా వంతు. నేను కూడా తప్పక విజయం సాధిస్తాన’ని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఇక బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సుల్తాన్‌పూర్ టికెట్‌ను అమ్ముకున్నారనే అంశంపై స్పందిస్తూ.. ‘ఆమె టికెట్లు అమ్ముకుంటారనే విషయం అందరికి తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో సుల్తాన్‌పూర్ టికెట్‌ను ఆమె రూ. 15 కోట్లకు అమ్ముకుంది. అయితే గతంలో ఇలాంటి అంశాల గురించి మాట్లాడాలంటే భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నాతో పాటు ప్రజలకు కూడా ధైర్యం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి వారి గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారని’ పేర్కొన్నారు. రాయ్‌బరేలీ, అమేథీలో ప్రచారం చేయమని పార్టీ తనను కోరలేదని తెలిపారు. ఒకవేళ అలా అడిగితే.. తప్పకుండా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment