సాక్షి, హైదరాబాద్: సీబీఐ కేసుల భయంతోనే సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ జపం చేస్తున్నారని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే దీనిని ముందుకు తీసుకొచ్చారని అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ఉన్న 3 సీబీఐ కేసుల్లో ప్రస్తుతం విచారణ జరుగుతున్నది వాస్తవం కాదేమో చెప్పాలని సవాల్ చేశారు.
సీబీఐ కేసులపై ప్రజలకు కేసీఆర్ వివరణ ఇవ్వాలని అన్నారు. ఈ కేసుల వల్లే రాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాల్లో బీజేపీకి కేసీఆర్ మద్దతు ప్రకటించారని ఆరోపించారు. రాష్ట్రంలోనే ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్.. ఇక దేశ రాజకీయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతోనే ఫ్రంట్ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
నోటికొచ్చినట్టుగా తిట్టడం, ఆ తర్వాత అనలేదని అబద్ధాలు చెప్పడం కేసీఆర్‌కు అలవాటన్నారు. ఇలాంటి వ్యక్తి దేశ రాజకీయాలను మారుస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన అసమర్థుడు కేసీఆర్ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment