‘ఆయనొక్కరే తెలంగాణ సాధించారా?'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని తానొక్కరే సాధించినట్లు సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. వరంగల్ సభలో సీఎం చేసిన ప్రసంగం.. కాంగ్రెస్‌పై వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం... సోనియా గాంధీ పట్టుబట్టి ఇచ్చిన విషయం ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పారు. బహిరంగ చర్చకు సవాల్ విసిరినా కేసీఆర్ సిద్ధంగా లేరని విమర్శించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరిట భారీగా దోపిడీకి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎకరానికి ఐదున్నర లక్షల రూపాయల ఖర్చు అవుతోందని చెప్పారు.
కేవలం వర్షా కాలంలో ఒక పంట కోసం ఇంత ఖర్చు అవసరం ఉన్నదా అని ప్రశ్నించారు. రాజస్థాన్ లో ఎకరానికి రూ. 7 వేల ఖర్చుతో మూడు పంటలకు నీళ్లు ఇస్తున్న విషయం సీఎంకు తెలియదా అని నిలదీశారు. పాత మెదక్ జిల్లా కోహిర్ ప్రాజెక్టు ద్వారా 15 ఏళ్లుగా అతితక్కువ ఖర్చుతో పంటలకు నీళ్లు ఇస్తున్న విషయం నిజం కాదా అన్నారు. సీఎం కళ్లుండీ చూడలేని కబోధిగా మారారని విమర్శించారు. కేసీఆర్ చెప్పే తప్పుడు లెక్కలని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.