
సాక్షి, న్యూఢిల్లీ : గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఉత్తర్ ప్రదేశ్ 2019లో మోదీ సర్కార్ పతనానికి నాందిపలుకుతుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యూపీ ప్రజలను మోసగిస్తూ వారి విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. నరేంద్ర మోదీని ప్రధానిని చేసిన యూపీ ప్రజలు ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆయనను ప్రధాని పదవి నుంచి సాగనంపాలని నిర్ణయించుకున్నారని వరుస ట్వీట్లలో మాయావతి పేర్కొన్నారు.
మోదీ దేశమంతటా తిరుగుతూ తనను ప్రధానిగా చేసింది యూపీ అని చెబుతుంటారని, ఇది నూటికి నూరు పాళ్లు నిజం కాగా ఇప్పుడు అదే యూపీ ప్రజలు ఆయనను వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. యూపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన మోదీ వారి విశ్వాసాన్ని కోల్పోయారని ట్వీట్ చేశారు. తాను వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తినని ప్రధాని చెప్పుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ, ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే మోదీ ఇలా చెబుతుంటారని, వాస్తవంగా బీసీల అభివృద్ధి కోసమే ఎస్పీ-బీఎస్పీ, ఆర్‌ఎల్డీలు జట్టుకట్టాయని తెలిపారు.
కాగా, ఎస్పీ వ్యవస్ధాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఒక్కరే దేశంలో బీసీల అభివృద్ధికి పనిచేస్తున్న ఏకైక నాయకుడని ఇటీవల ఆమె ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ నేతగా మాయావతి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment