ఆస్తులు కాపాడుకోవడానికే టీడీపీ ఆందోళనలు  | Midhun Reddy Comments On TDP And Chandrababu | Sakshi
Sakshi News home page

ఆస్తులు కాపాడుకోవడానికే టీడీపీ ఆందోళనలు 

Published Wed, Jan 15 2020 4:59 AM | Last Updated on Wed, Jan 15 2020 8:31 AM

Midhun Reddy Comments On TDP And Chandrababu - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషా

రాయచోటి: అమరావతి పేరుతో ఆస్తులను కాపాడుకోవడానికే టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ జిల్లా రామాపురంలో మంగళవారం ఆయన ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలన వికేంద్రీకరణతోపాటు ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకు పోతున్నారని మిథున్‌ రెడ్డి చెప్పారు. రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడదన్న విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. తిరువూరుకు సమీపంలో రాజధాని వస్తుందని ముందుగా ప్రచారం చేసి.. తర్వాత అమరావతిలో భూములు కొనుగోలు చేశాక దాన్ని రాజధానిగా ప్రకటించిందా టీడీపీ కాదా అని నిలదీశారు.

సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని మరిచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని పెంచుకోవడానికే పాలనను సాగించారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రకటనపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ నేతలు తమ భూముల కోసం ఆందోళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై కమిటీలు సూచించిన విధానాలను అమలు చేసేందుకు సీఎం ముందుకు వచ్చారన్నారు. ఇదే విషయంపై అసెంబ్లీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ వద్దని విశాఖ, కర్నూలుకు వెళ్లి చెప్పే దమ్ము టీడీపీ నేతలకుందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు పాలనలో గ్రాఫిక్స్‌లో అమరావతిని చూపించింది వాస్తవమా.. కాదా చెప్పాలన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌పాషా విమర్శించారు. సీఎం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంటే వాటిని సినిమా యాక్టర్లతో రెచ్చగొట్టేలా చేయడం సిగ్గుచేటన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement