సాక్షి, విశాఖపట్నం : విశాఖ గ్యాస్ లీక్ ఘటన బాధితులలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులంతా కోలుకున్నారని చెప్పారు. డిశ్చార్జ్ అవుతున్న అందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం అందించామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనంత ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ ఇస్తే.. చంద్రబాబు నాయుడు హోమ్ క్వారంటైన్‌లో ఉండి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి : విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు)
‘ గ్యాస్ లీక్ ఘటన జరిగిన గంటల్లోనే సీఎం జగన్ బాధితులను పరామర్శించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ అందించనంత రూ.కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. బాధితుల్లో భరోసా నింపేందుకు గ్రామాల్లో మంత్రుల కమిటీ బస చేసింది. స్టెరిన్ తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఒక్క టన్ను స్టెరిన్ కూడా ఉండడానికి వీల్లేదని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. ఇంట్లో కూర్చొని చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా నగరం ప్రమాదంలో 21 మంది చనిపోయారు. రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ వల్ల 29 మంది చనిపోయారు. అప్పుడు వారికి చంద్రబాబు ఎలాంటి సహాయం అందించారు.. ఇప్పుడు సీఎం జగన్ ఎలాంటి సహాయం అందించారో చర్చకు సిద్ధమా’ అని టీడీపీ నేతలకు మంత్రి కన్నబాబు సవాల్ విసిరారు.
టీడీపీకి సంబంధించిన ఏ నిపుణడు వచ్చినా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే చంద్రబాబు ఈ రోజు టీడీపీ సమావేశంలో డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. ఘటన జరిగిన వెంటనే 6 కమిటీలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించాం.. ఈ కమిటీలు అన్ని చంద్రబాబు చెబితేనే వేశామా అని ప్రశ్నించారు. సింహాచల భూములను డీనోటిఫై చేసి ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి అప్పగించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. మంతనాలు, లాలూచీ పడే అలవాటు చంద్రబాబుకు మాత్రమే ఉందని కన్నబాబు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment