సాక్షి, విశాఖపట్నం : ప్రతీ విషయాన్ని రాజకీయకోణంలో చూసి కుట్రలు చేయడమే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పని అని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించి బాధితులని ఆదుకునే ప్రయత్నం చేసిందో గమనించుకోవాలన్నారు. బుధవారం గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బాధిత గ్రామాలలో ప్రస్తుతం సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి. నిన్నటి నుంచి బాధిత గ్రామాలలో 24 గంటలపాటు పనిచేసేలా వైద్య బృందాలను ఏర్పాటు చేశాం. ఆయా గ్రామాల ప్రజలకోసం 15 పడకలతో వైఎస్సార్ క్లీనిక్ ప్రారంభిస్తున్నాం. సంఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు ప్రజల భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఎల్జీ పాలిమర్స్‌లో ఉన్న స్టైరిన్‌ని వెనక్కి పంపిస్తున్నాం. ఇప్పటికే ఫ్యాక్టరీలోఉన్న స్టైరిన్‌ని ట్యాంక్‌ల ద్వారా పోర్టుకి తరలించాం. ( విశాఖ గ్యాస్ లీకేజీ: ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు )
పోర్టు నుంచి దక్షిణ కొరియాకి షిప్ ద్వారా తరలిస్తున్నాం. విశాఖలో మిగిలిన స్టైరిన్‌ను సైతం ఒకటి రెండు రోజులలో మరో షిప్ ద్వారా తరలిస్తాం. బాధిత గ్రామాలలో ప్రజల ఆరోగ్య సమస్యలపై ధీర్ఘకాలం పనిచేసేలా ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో 10 మంది వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రం లోపు కోలుకున్న బాధితులని కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పరిహారాన్ని కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యే బాధితులకి అందజేసి బస్సులలో గ్రామాలకి తరలిస్తాం. ఒక్క టన్ను స్టైరిన్ కూడా ఉండటానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment