
రాయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఛత్తీస్‌గఢ్ విద్యాశాఖ మంత్రి ప్రేమసాయి సింగ్ టేకమ్ విచిత్రమైన ఆరోపణలు చేశారు. రైల్వేలో దొంగతనాల వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు. రెండోరోజుల కిందట అమర్‌కంటక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన చోరీ ఘటనలో మంత్రి టేకమ్ బ్యాగు పోయింది. దీంతో ఆయన ఏకంగా మోదీని చోరీలు చేయిస్తున్నారంటూ విడ్డూరమైన ఆరోపణలు చేశారు.
‘మోదీజీ రైళ్లలో చోరీలు చేయిస్తున్నారు. మంత్రుల బ్యాగులను కొట్టేస్తున్నారు. ఆయన ప్రభుత్వం సాధించిన ఘనత ఇది’ అని టేకమ్ చెప్పుకొచ్చారు. మోదీ సర్కారు వందరోజుల పాలనను, రైళ్లలో దొంగతనాలతో ముడిపెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారు. అమర్‌కంటక్ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్‌క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తున్న టేకమ్ బ్యాగును దొంగలు కొట్టేసినట్టు కథనాలు వచ్చాయి. ఆయన బ్యాగులో నగదుతోపాటు విలువైన పత్రాలు ఉన్నట్టు సమాచారం.