
జలీల్ ఖాన్
విజయవాడ దుర్గగుడి పార్కింగ్ వద్ద టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందించారు.
సాక్షి, అమరావతి: విజయవాడ దుర్గగుడి పార్కింగ్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందించారు. ఆయన గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. దుర్గగుడి పార్కింగ్ వద్ద తాను డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు చేశారని.. వాటిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ దగ్గర ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా వైఖరి మార్చుకున్నారని ఆరోపించారు. మంత్రి లోకేష్ అవినీతిపై ఆధారాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు.
ఒకసారి రాజధాని ప్రాంతాన్ని చూస్తే అభివృద్ధి ఏం జరుగుతుందో కనిపిస్తుందన్నారు. పవన్ కల్యాణ్ సభ పెడుతున్నారంటే.. ప్రత్యేక హోదాపై గట్టి పోరాటం చేస్తారని ప్రజలంతా భావించారని, కానీ ఆయనేమో అసలు విషయం గాలికి వదిలేశారని తెలిపారు. ప్రధాని మోదీని ఒక్కమాట అనని పవన్.. జనసేన వల్లే టీడీపీ గెలిచినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేన, బీజేపీ పార్టీలు లేనప్పుడే మెరుగైన ఫలితాలు సాధించామని, ఆ పార్టీలతో కలిసిన తర్వాతే తమ ఓటు బ్యాంక్ తగ్గిందని జలీల్ ఖాన్ వెల్లడించారు.