మçహాధర్నాలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే విశ్వ
ఉరవకొండ: అధికారంలోకి వచ్చి నాలుగేళ్లూ పూర్తయినా ఒక్క నిరుపేదకైనా ఇంటిపట్టా ఇచ్చారా..? అని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి 89 ఎకరాల భూమి కొనుగోలు చేశారనీ, అయితే వాటిలో పట్టాలిచ్చేందుకు ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్న డిమాండ్‌తో సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వేలాది మంది ప్రజలతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పెద్ద ఎత్తున మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ మండల రూరల్ కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇంటిపట్టాలు ఇవ్వడానికి 2013లో అఖిల పక్ష నేతల కమిటీ ఆమోదం తెలిపిందన్నారు.
అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ కూడా అర్హులైన వారికి పట్టాలు ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దాదాపు 3,204 మందితో జాబితా సిద్ధం చేసిన అధికారులు.. 2016లో తిరిగి దీనిపై మరోసారి విచారణ జరిపారన్నారు. ఇందులో 1,657 మందిని అర్హులుగా తేల్చారనీ... అయినా పట్టాలు ఇవ్వలేదన్నారు. అర్హులకు ఇంటిపట్టాలు, ఇళ్లు మంజురు చేయాలని గతంలో ఎన్నోసార్లు కలెక్టర్‌కు, జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం చంద్రబాబుకు విన్నవించినట్లు తెలిపారు. అయినా టీడీపీ ప్రభుత్వం ఉరవకొండలో ఒక్కరికి కూడా పట్టా మంజూరు చేయలేదన్నారు.
పయ్యావుల కేశవ్ డ్రామా
అర్హులైన 1,657 మందికి ఇంటిపట్టాలు ఇవ్వాలని తాను హైకోర్టును ఆశ్రయిస్తే దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్సీ కేశవ్ రెవెన్యూ అధికారుల చేత రిట్ పిటిషన్ వేయించారన్నారు. పయ్యావుల కేశవ్ .. కేవలం తన పార్టీ నాయకులు, కార్యకర్తల పేర్లు ఇంటిపట్టాల జాబితాలో చేర్చేందుకు అధికారుల చేత నాటకం ఆడించారన్నారు. గతంలో ఎంపిక చేసిన 1,657 మంది లబ్ధిదారుల కూడా పట్టాలు అందకుండా కుట్ర పన్నుతున్నారన్నారు.
వారికి ఊడిగం చేయడం మానాలి
కొందరు అధికారులు ఎమ్మెల్సీ కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శీనప్పకు ఊడిగం చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఉరవకొండలో టీడీపీ పాలన సాగడం లేదని పయ్యావుల పాలన సాగుతోందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజ లకు సేవ చేయడం నేర్చుకోవాలన్నారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీ సభ్యులుగా దొంగలు, దోపిడీదారులు, బ్రాంది షాపు నిర్వాహకులు, కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారే అధికంగా ఉన్నారన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
మధ్యాహ్నం రెండు గంటలవుతున్నా అధికారులు రాకపోవడంతో ప్రజలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజలు అధికారుల తీరును నిరసిస్తూ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న ఓబన్న.. జూలై 1వతేదీలోగా ఇంటిపట్టాలు పంపిణీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు లలితమ్మ, తిప్పయ్య, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బోయకొండమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు అశోక్, తేజోనాథ్, బసవరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment