పార్లమెంట్‌లో ఆగని రభస | Modi government vs Opposition: Stormy week in Parliament expected | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ఆగని రభస

Published Tue, Dec 19 2017 2:58 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

Modi government vs Opposition: Stormy week in Parliament expected - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం కొనసాగుతోంది. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా లోక్‌సభ, రాజ్యసభల్లో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు దిగింది. దీంతో వరుసగా రెండో రోజూ పార్లమెంట్‌ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. సోమవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో సభ వాయిదా పడింది. సభ తిరిగి మొదలైన తర్వాత జీరో అవర్‌ ప్రారంభమవ్వగానే కాంగ్రెస్, వామపక్షాలు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లాయి. ఈ ఆందోళనల మధ్యే ఐదు బిల్లుల్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.

అనంతరం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు సభా కార్యక్రమాలు అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో చైర్మన్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సభకు వచ్చి.. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ ఉపముఖ్యమంత్రి  కేశవ్‌ ప్రసాద్‌మౌర్యతో పాటు పార్టీ వైఖరికి నిరసనగా రాజీనామా చేసిన ఎంపీ నానా పటోలే రాజీనామాను కూడా లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. 

ప్రధానులకు మ్యూజియం: కేంద్రం
దేశానికి విశిష్ట సేవలందించిన ప్రధానులందరికీ ఢిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్‌ సమీపంలో ఓ మ్యూజియంను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ పార్లమెంటుకు తెలిపారు. దీనివల్ల ఆయా ప్రధానుల జీవనవిధానం, వారి కాలంనాటి పరిస్థితులు తెలుసుకోవచ్చన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement