
ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళి అర్పిస్తున్న మోత్కుపల్లి నర్సింహులు
సాక్షి,హైదరాబాద్: ‘చంద్రబాబూ..నీ వల్లే తెలంగాణలో టీడీపీ పార్టీ బలైపోయింది. ఆంధ్రాలో పతనమైపోయింది. నీవు ఉన్నంత కాలం పార్టీ బతకదు. ఇక పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ పార్టీని నందమూరి వంశానికి అప్పజెప్పు’ అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయిన సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్
ఘాట్ వద్ద మోత్కుపల్లి నివాళులు
అర్పించి, పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ ప్రజలందరూ ఎన్నో ఏళ్లుగా చంద్రబాబు అరాచకాలను భరించి చివరకు రాజకీయ సమాధి చేశారన్నారు. వెన్నుపోటుతో పార్టీని లాక్కున్న చంద్రబాబు రాజకీయ పతనాన్ని కోరుతూ.. ఎన్టీఆర్ ఆత్మ ఆంధ్రా ప్రజలందర్నీ ఆవహించి బాబును ఓడించి, జగన్‌ను గెలిపించిందని చెప్పారు. తెలంగాణలో పార్టీ బలైపోవడానికి కారణం చంద్రబాబేనని, ఓటుకు నోటు కేసులో పార్టీ పరువును బజారుకీడ్చి, దొంగలా పట్టుబడి, కేసీఆర్‌కు భయపడి తెలంగాణ నుంచి పారిపోయాడని మండిపడ్డారు. జగన్‌ను గెలిపించిన ఆంధ్ర ప్రజలకు కృతజ్ఞతలని, కనీ వినీ ఎరుగని రీతిలో మెజార్టీ సాధించి ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆయనకు మాల, మాదిగల తరఫున అభినందనలు తెలుపుతున్నానన్నారు. బాబుపై సీబీఐ విచారణ జరపాలని ప్రధానిని కోరతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment