
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలుస్తామని, ఆమె తప్పనిసరిగా తమ రాజీనామాలను ఆమోదిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ పోరాడుతున్నది వైఎస్సార్‌సీపీనేని, హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కలిశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మేకపాటి మీడియాతో మాట్లాడారు. రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని లోక్‌సభ స్పీకర్‌కు వివరించి, రాజీనామాలు ఆమోదించక తప్పని పరిస్థితిని కల్పిస్తామని చెప్పారు.
హోదా సాధనలో భాగంగా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామన్నారు. తీర్మానంపై జాతీయ నేతల మద్దతు కూడగట్టామని తెలిపారు. కానీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అవిశ్వాసంపై చులకనగా మాట్లాడి తర్వాత కొందరు నేతలు మాట మార్చారని గుర్తుచేశారు. కేసుల భయంతోనే చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించలేదన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు, ప్యాకేజీల కోసమే చంద్రబాబు ఎన్డీఏతో దోస్తీ కట్టారని విమర్శించారు. కానీ లాభం లేకపోవడంతో చంద్రబాబు ఇప్పుడు కొత్త స్నేహితులను వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు ఎప్పుడైనా స్వార్ధ రాజకీయ నాయకులే కావాలని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు ఏమాత్రం పట్టవన్నారు. 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను అనైతికంగా పార్టీలో చేర్చుకున్న చంద్రబాబుకు విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చ తెచ్చిన వ్యక్తి చంద్రబాబేనని మేకపాటి పేర్కొన్నారు. టీడీపీ సర్కార్ నాటకాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవారికే పట్టం కట్టాలని ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మేం ఏ ఫ్రంట్‌తో దోస్తీ కట్టం, అన్ని ఫ్రంట్‌లు అస్తవ్యస్తంగానే ఉన్నాయని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.