శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఇతర పార్టీల నేతల చేరిక సందర్భంగా మాట్లాడుతున్న హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌తో నడిస్తే సాగునీరు, తాగునీరు వస్తాయని.. చంద్రబాబుతో కలసి వెళ్తే మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని సాగునీటి మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలు ఎవరితో ఉంటారో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని విమర్శించారు. గతంలోలాగే తెలంగాణను దోచుకోవాలనుకునే దొంగలకు కాంగ్రెస్ వాళ్లు సద్దులు మోస్తున్నారని దుయ్యబట్టారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కులసంఘాల నాయకులు శుక్రవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘60 ఏళ్లు తెలంగాణ గడ్డను వంచిస్తూ మన సంపదను దోచుకుపోయిన వలస పాలకులను తరిమికొట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒకవేళ మహాకూటమి గెలిస్తే టీడీపీని ప్రభుత్వంలోకి చేర్చుకుని రెండు మంత్రి పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసులో అరెస్టు కాకుండా హోంశాఖ, తెలంగాణ పంట భూములు ఎండబెడుతూ కృష్ణా, గోదావరి నీళ్లను సీమాంధ్రకు తరలించుకుపోయేందుకు సాగునీటి శాఖ. ఈ రెండింటినీ బాబు పార్టీకి కట్టబెట్టాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నట్లు చెప్పుకుం టున్నారు..’ అని అన్నారు.
విద్యుత్, పంచాయతీలు, ప్రాజెక్టులు..
సాగునీరు, తాగునీరు కేసీఆర్‌తోనే సాధ్యమని హరీశ్ చెప్పారు. ‘కాంగ్రెస్, టీడీపీ 60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసి ప్రజల కళ్లలో ఆనందాన్ని చూసింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి చూపెట్టింది. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఏ అర్ధరాత్రో వచ్చేది. పగలంతా ఉండేది కాదు. ప్రజలు నరకయాతనపడ్డారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు సరఫరా చేస్తోంది. టీడీపీ పక్కా ఆంధ్రా పార్టీ. తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తోంది. 2009లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు సీమాంధ్ర వారిని రెచ్చగొట్టినప్పుడు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు పౌరుషం లేకుండా వారి పల్లకీ మోశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల గోడు పట్టించుకోకుండా ఒక్క చిత్తూరు జిల్లాకు తాగునీటి కోసం రూ.7 వేల కోట్లు కేటాయించారు. దీనిపై నేను నిలదీస్తే కిరణ్ రెచ్చిపోయి నీకూ, నీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని విర్రవీగారు.
అప్పుడూ కాంగ్రెస్ నేతలు కిరణ్ వెనుక చేరి బల్లలు చరిచి కేరింతలు కొడుతూ పదవుల కోసం భజనలు చేశారు. ఇప్పుడు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కొయిల్‌సాగర్ ప్రాజెక్టుల మోట ర్లను బంద్ పెట్టాలని బాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. పాలమూరు ప్రాజెక్టును పొట్టగొట్టాలనే కుట్రతో ఉన్న బాబుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వంత పాడుతున్నారు. కొడంగల్‌కు సరిపడా నీరిచ్చే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బాబు కుట్ర పన్నుతున్నారు..’అని విమర్శించారు.
అభివృద్ధిని గెలిపించాలి..
కాంగ్రెస్, టీడీపీ కలసి 60 ఏళ్లలో పాలమూరు జిల్లాలో కేవలం లక్ష ఎకరాలకే సాగునీరు ఇచ్చాయని హరీశ్ తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్లు చెప్పారు. పాలమూరు పచ్చబడడంతో గతంలో వలసబోయిన కూలీలంతా వెనక్కి వచ్చి సాగు చేసుకుంటున్నారు. మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా, బతుకమ్మ చీరలు పంచకుండా కాంగ్రెస్ వాళ్లు అడ్డుపడుతున్నారు.
నాలుగు సీట్ల కోసం అవకాశవాద పొత్తులు పెట్టుకున్న అవకాశవాద పార్టీలు కాంగ్రెస్, టీడీపీలను ఓడించాలి. తెలంగాణ సమాజం ఏకమై అభివృద్ధిని గెలిపించాలి. మహాకూటమికి ఘోర పరాభవం తప్పదు. తప్పుడు కూటమికి కనీసం ప్రతిపక్ష హోదా రాదు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కొడంగల్ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కొడంగల్‌లో ఎగిరేది గులాబీ జెండానే’అని హరీశ్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment