
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు టీడీపీ నేతలకు కమీషన్ల వరంగా మారిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం గురించి సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. మాటలు తప్ప చేతలు లేవని మండిపడ్డారు. 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నచంద్రబాబు కనీసం పోలవరానికి పరిపాలన మంజూరు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిల హయాంలో రూ. 5,136 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం అనుమతులు కూడా అప్పుడే వచ్చాయన్నారు.
దురదృష్టవశాత్తూ కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందన్నారు. నిధుల మంజూరు గురించి కేంద్రం ఎలాంటి భరోసా ఇవ్వలేదని, ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ అంచనాల మేరకు ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ. 58,319 కోట్లు అవసరం అని, కాని మోదీ ప్రభుత్వం పిల్లికి భిక్షం వేసినట్లు మూడేళ్లలో రూ. 4,328 కోట్లు మాత్రమే ఇచ్చింన్నారు. ఈ మేరకు నిధులు విడుదల చేస్తే కొన్ని దశాబ్ధాలైనా ప్రాజెక్టు పూర్తి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.