
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న నాగం జనార్దన్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. పార్టీ సాధారణ సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా చేస్తున్నట్లు మెయిల్ ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్‌కు లేఖ పంపినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన సొంత ఇంట్లో నాగం తన అనుచరులతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత అందరి ఆమోదంతో రాజీనామా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
తన గోడు పట్టించుకోనందుకే..
బీజేపీ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన నాగంజనార్దన్‌రెడ్డి అందుకు దారి తీసిన పరిస్థితులను విలేకరులకు వెల్లడించారు.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తాను కీలకంగా వ్యవహరించటమే కాక ‘నాగం నగారా’ పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహించా నని తెలిపారు. అందరిలా కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామాను ఆమోదం చేసుకుని తిరిగి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందానని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిందని, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలికిందన్న అభిమానంతో ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆ తర్వాత అధికార టీఆర్‌ఎస్ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో భారీ కుంభకోణాలకు పాల్పడుతుండగా ఈ విషయాన్ని ఇటు రాష్ట్ర పార్టీకి, జాతీయ పార్టీ కీలక నేతలకు రికార్డుల రూపంలో ఆధారాలతో సహా అందించినా లాభం లేకపోవడంతో మనస్తాపం చెందినట్లు వివరించారు. తాను ఇచ్చిన ఆధారాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తారని భావించినప్పటికీ రాష్ట్ర ఎమ్మెల్యేలు తన గోడు పట్టించుకోకపోవడంతో ఇక పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చానని చెప్పారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తన అభిమానులు ఆ పార్టీని వీడినందుకు సంతోషంగా ఉన్నానని, గత 30 ఏళ్లుగా తన వెంట ఉన్న ప్రతి కార్యకర్త తిరిగి తన వెంట నడిచేం దుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలివ్వడంతో తిరిగి సొంత నియోజకవర్గంలోనే తన అభిమానుల మధ్య బీజేపీకి రాజీనామా లేఖను పంపినట్లు నాగం వెల్లడించారు.
వాళ్లే నిర్ణయిస్తారు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. ఏ పార్టీలో చేరాలన్న విషయాన్ని మాత్రం కార్యకర్తలు, అభిమానులే నిర్ణయిస్తారని నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. అధికార టీఆర్‌ఎస్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే అన్ని శక్తులతో తాను కలిసి పనిచేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కార్యకర్తలు కోరుతున్నారని ఆయన చెప్పారు.
దామోదర్‌రెడ్డితో విభేదాలు లేవు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో తనకెలాంటి విభేదాల్లేవని.. ఆయన, తాను పాత మిత్రులమని నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో తాను ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లకు లోబడే నడుచుకుంటానని వెల్లడించారు. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం తనకు కొట్టిన పిండి అని, ఇక్కడి పరిస్థితులన్నీ తెలుసునన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కాలు పెడతానని నాగం దీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మున్ముం దు ముచ్చెమటలు పట్టిస్తానని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని స్పష్టం చేశారు. నాగం జనార్దన్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు నాగం శశిధర్‌రెడ్డి బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా పలువురు అనుచరులు కూడా పార్టీకి రాజీనామా చేసి నాగం వెంట నడుస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment