సాక్షిప్రతినిధి, ఖమ్మం: పదవులపరంగా జిల్లాకు మరో అవకాశం లభించింది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం లభించినట్లయింది. దీంతో రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లాకు మరింత ప్రాధాన్యం లభించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం నుంచి లోక్‌సభకు ఎన్నికైన నామా నాగేశ్వరరావు మొదటిసారి టీడీపీ ఎంపీగా అడుగిడితే.. రెండోసారి టీఆర్‌ఎస్ ఎంపీగా కాలుమోపనున్నారు. మొదటి పర్యాయం టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత టీఆర్‌ఎస్ పార్టీకి అదే లోక్‌సభా పక్ష నాయకుడిగా వ్యవహరించే అవకాశం దక్కింది.
2009లో తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా ఎన్నికైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరుగురు లోక్‌సభ సభ్యులు గల టీడీపీకి లోక్‌సభా పక్ష నేతగా వ్యవహరించిన నామా నాగేశ్వరరావు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటీవలి కాలం వరకు టీడీపీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసిన ఆయన.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఉనికి కోల్పోతున్న దశలో ఆయన లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిందే తడవుగా ఆయనకు టీఆర్‌ఎస్ ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఇవ్వడంతో ఆయన భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరిపై విజయం సాధించారు. ఐదేళ్లపాటు టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిగా వ్యవహరించిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న టీఆర్‌ఎస్.. నామాకు టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చింది.
హైదరాబాద్‌లో ఎంపిక..
ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నామాను పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. లోక్‌సభ సభ్యుడిగా అనుభవం ఉండడంతోపాటు జాతీయ స్థాయి రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉండడాన్ని, సమస్యలపై అవగాహన ఉండడం, ప్రజల వాణిని వినిపించగల నేర్పు ఉండడం వంటి అంశాలు నామా టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడానికి ఉపకరించాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2009లో టీడీపీ నుంచి ఆరుగురు లోక్‌సభకు ఎన్నిక కాగా.. అందులో తెలంగాణ నుంచి నామా నాగేశ్వరరావుతోపాటు ఆదిలాబాద్‌కు చెందిన రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరే ఎన్నికైనా ఆయనకు జాతీయ నేతలతో గల సంబంధాలు.. అప్పట్లో చంద్రబాబు నాయుడితో గల సాన్నిహిత్యం ఆయనను టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిని చేసింది.
ఇప్పుడు సైతం సీఎం కేసీఆర్‌తో గల సాన్నిహిత్యం, గత అనుభవం వంటి అంశాలు ఆయనను లోక్‌సభ టీఆర్‌ఎస్ పక్ష నాయకుడిగా అయ్యేలా చేసిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నాయకుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజా సమస్యలపై ఆయనకు గళమెత్తే అవకాశం లభించినట్లయింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, పలు రైల్వే లైన్ల ఏర్పాటు వంటి అంశాలను సభలో ప్రస్తావించి.. పరిష్కరించడానికి మరింత అవకాశం లభించినట్లయిందని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు విజయం సాధించడం అనంతరం ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించి మెజార్టీ మండలాల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడంతోపాటు ఖమ్మం జెడ్పీ చైర్మన్ పదవిని సైతం కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం వ్యక్తమవుతోంది. నామా టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడంతో జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment