ఏడాదిలోనే రెండు లక్షల ఐటీ కొలువులా? | Nara Lokesh Statement on IT Jobs | Sakshi
Sakshi News home page

ఏడాదిలోనే రెండు లక్షల ఐటీ కొలువులా?

Published Wed, Aug 15 2018 12:22 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

Nara Lokesh Statement on IT Jobs - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వచ్చే ఏడాది(2019) కల్లా రాష్ట్రంలో అక్షరాలా రెండు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవలి కాలంలో పదేపదే ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను గమనిస్తే, లోకేశ్‌ ప్రకటనలు ఎంత వాస్తవ దూరంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఐటీ ఆధారిత ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యల్ప ప్రగతిని సాధించినట్టు పొరుగు రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు ప్రస్తుత పరిపాలనలో ఐటీ పురోగతి నామమాత్రంగానే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు రాలేదు. కొత్త ఇన్వెస్టర్లు కూడా ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపడం లేదు.

రాష్ట్రంలో గడచిన మూడేళ్లలో కేవలం 15 వరకు మాత్రమే చిన్న ఐటీ సంస్థలు ఏర్పడ్డాయి. కానీ, కొత్తగా ఐటీ యూనిట్‌ ఏర్పాటుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీని కాగితాలపైనే ఆకర్షణీయంగా చూపడం, ఆ తర్వాత అమలులో వైఫల్యమేనని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ మాత్రం వచ్చే ఏడాది నాటికే కొత్తగా రెండు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొడుతున్నారు. మంత్రి లోకేశ్‌ ఈ నెల 9న విశాఖలో ఊరూపేరూ లేని 13 ఐటీ కంపెనీలకు ప్రారంభించారు.

  • భారత్‌లో మొత్తమ్మీద 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2017లో నాస్‌కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌) లెక్కల ప్రకారం ఐటీ ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగుల సంఖ్య లక్షన్నర.
  • ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 20 వేలు.
  • రాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌(ఏపీఐటీ) ప్రకారమే ఐటీ హబ్‌ అయిన విశాఖపట్నంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 16,988. ఇక విజయవాడ, తిరుపతి, కాకినాడల్లోని ఐటీ కంపెనీల ఉద్యోగులతో కలుపుకుని చూస్తే మొత్తంగా 20 వేల లోపే ఉంటుంది.
  • ఐటీ బూమ్‌ వచ్చిన రెండు దశాబ్దాల నుంచి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల సంఖ్య 20 వేల కంటే మించలేదు. మరో ఏడాదికల్లా 2 లక్షల ఉద్యోగాలు రావడం సాధ్యమేనా?
  • నారా లోకేశ్‌ అన్నట్టుగానే ప్రపంచంలోని ఐటీ కంపెనీలన్నీ ఒకేసారి ఇబ్బడిముబ్బడిగా వెల్లువలా వచ్చేస్తాయని భావించినా... ఆ మేరకు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించగలదా?
  • 2 లక్షల ఉద్యోగులు.. అంటే ఒక్కో ఉద్యోగికి వంద చదరపు అడుగుల(ఎస్‌ఎఫ్‌టీ) స్థలం కావాలి(కామన్‌ ఏరియాతో సహా). ఈ లెక్కన 2 లక్షల మందికి 2 కోట్ల ఎస్‌ఎఫ్‌టీ కావాలి. అంటే 200 లక్షల చదరపు అడుగులు.
  • బహుళ అంతస్తుల భవనాలు కట్టాలని అనుకున్నా.. ప్రస్తుతం భూమి లభ్యతను పరిశీలిస్తే లక్ష చదరపు అడుగుల స్థలం కూడా సిద్ధంగా లేదు.
  • ఆరునెలల క్రితం విశాఖపట్నంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఐటీ రంగంలో విశాఖకు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గడిచిన మూడేళ్లలో 40 ఐటీ కంపెనీలు ముందుకొచ్చినా భూముల కొరత వల్ల వెనక్కి వెళ్లిపోయాయి. ఈ రంగంలో పనిచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గృహ వసతి సమస్య కూడా తీవ్రంగా ఉంది. అందువల్లే  విశాఖలో పని చేసేందుకు ఐటీ రంగ నిపుణులు ఆసక్తి చూపడం లేదు. (చదవండి: విశాఖలో ఐటీ రివర్స్‌ గేర్‌!) ఇక్కడ పనిచేసే వారు కూడా హైదరాబాద్, బెంగుళూరు, మంగుళూరు, చెన్నై వంటి నగరాలకు తరలిపోతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. కానీ, వచ్చే ఏడాదికల్లా రెండు లక్షల ఉద్యోగాలు కల్పించేస్తామని ఇప్పుడు చెబుతుండడం గమనార్హం.

ఐటీ అభివృద్ధికి ప్రోత్సాహమేదీ?  
రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తే విరివిగా ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌ హామీ ఇస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఏపీలోని ఐటీ కంపెనీలకు ప్రభుత్వ నిరాదరణ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

  • ఇప్పుడున్న ఐటీ కంపెనీలకు విద్యుత్‌ టారిఫ్‌ యూనిట్‌కు రూ.6.50 అని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి యూనిట్‌కు రూ.9.50 చొప్పున వసూలు చేస్తోంది.
  • దేశంలో ఐటీ కంపెనీల నుంచి అత్యధిక కరెంటు చార్జీలు వసూలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే.
  • ఐటీ కార్యాలయాల అద్దె, విద్యుత్, స్టాంప్‌ డ్యూటీ, ఇంటర్నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ తదితరాల్లో ఏపీ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం లేదనేది ఐటీ కంపెనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు 100 ఎంబీపీఎస్‌ బ్యాండ్‌ విడ్త్‌కు రూ.1.25 లక్షలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఐటీ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.
  • టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో ఐటీ కంపెనీలకు సర్కారు పరంగా రావాల్సిన ఇన్‌సెంటివ్స్‌ కూడా ఇవ్వలేదు.
  • రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఐటీ ఎగుమతులు జరుగుతున్న విశాఖపట్నంలో కాకుండా ఐటీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని కూడా ఐటీ కంపెనీల నిర్వాహకులు తప్పుపడుతున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement