
హైదరాబాద్: రాష్ట్రంలో ఐదేళ్లు పాలన సాగించాలని ప్రజలు ఓట్లువేస్తే పాలన చేతగాక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేపీహెచ్‌బీకాలనీలోని టీడీపీ కార్యాలయంలో సీపీఐ నాయకులతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహాకూటమిలోని పార్టీలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డిసెంబర్ 11 తరువాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు పారిపోక తప్పదన్నారు. కేసీఆర్ అటు బీజేపీతోను, ఇటు ఎంఐఎంతోనూ పరోక్ష సంబంధాలను పెట్టుకున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.
ఎవరు ముఖ్య మంత్రి అయినా తమ కాళ్లవద్దకు రావాల్సిందేనంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రకటించడం సిగ్గుచేటని, ఇందుకు బాధ్యతగా కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీపై, ప్రధాని నరేంద్రమోదీపై కేసీఆర్ ఒక్క విమర్శ కూడా చేయలేదని, ఇప్పుడు మాత్రం ఎన్నికల్లో ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజల్ని మోసగిస్తున్నారని విమర్శిం చారు. కేసీఆర్ దయవల్లే తామంతా మహాకూటమిగా జతకలిశామని, కూటమి పార్టీలతో కేసీఆర్ బెంబేలెత్తిపోతున్నారని తెలిపారు. కూకట్‌పల్లిలో సుహాసిని గెలుపునకు సీపీఐ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి పార్టీలు కృషిచేస్తాయని తెలిపారు. అనంతరం కూకట్‌పల్లి అభ్యర్థి సుహాసిని మాట్లాడుతూ తాను స్థానికురాలినేనని, హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగానని, స్థానిక సమస్యలను పరిష్కరించే సత్తా తనకుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment