నారావారిపల్లెలో ఎద్దుల బండిపై సీఎం చంద్రబాబు
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రావటానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుపై దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రం హక్కులను కేంద్రం లాక్కొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు సోమవారం తన స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. రెండు రోజులపాటు గ్రామంలోనే ఉండి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. అమరావతికి తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సొంత గ్రామంలో పండుగ జరుపుకునే సంప్రదాయాన్ని తన భార్య భువనేశ్వరి 20 ఏళ్ల క్రితమే ప్రారంభించిందని చెప్పుకొచ్చారు.
సంక్రాంతిని అడ్డం పెట్టుకుని జూదాలు ఆడడం మంచిది కాదన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కూడా చెయ్యని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టామన్నారు. ప్రస్తుతం ఏపీలో వందశాతం అభివృద్ధి చేశామని, సమస్యలన్నీ పరిష్కరించామని తెలిపారు. ఇక ఉన్నవన్నీ వ్యక్తిగత సమస్యలేనని చెప్పారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎన్‌ఐఏ చేపడుతున్న విచారణపై విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోకి ఎన్‌ఐఏ రాకూడదన్నారు. రాష్ట్రానికి ఉన్న హక్కులను కేంద్రం లాక్కుంటోందని ఆరోపించారు. హక్కుల కోసం పోరాడుతామన్నారు.
షర్మిల తెలంగాణలో ఎందుకు ఫిర్యాదు చేశారో?
వైఎస్ షర్మిలకు ఏమైందని తెలంగాణలో ఫిర్యాదు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం సమంజసం కాదన్నారు. షర్మిల తెలంగాణలో ఎందుకు ఫిర్యాదు చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎవరూ వేలెత్తి చూపని క్యారెక్టర్ తనదని పేర్కొన్నారు. మీరు ఎప్పుడూ పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు కదా? ఈసారి ఎవరితో పొత్తుపెట్టుకోనున్నారు? అని ఓ విలేకరి ప్రశ్నించగా... టీడీపీ ఒంటరిగా కూడా పోటీచేసిందని, ఒకసారి వెనక్కి వెళ్లి చూడమన్నారు. ‘రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్‌తో కలిశాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం రూ.75 వేల కోట్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఇబ్బందులే ఉండేవి కావన్నారు. కేసీఆర్‌తో కలిసి ప్రత్యేకహోదా తీసుకొస్తామని వైఎస్ జగన్ చెబుతున్నారని, మరి ప్రధాని నరేంద్రమోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment