
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఉప ఎన్నికలకు నగారా మోగడంతో కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులపై అధికార, విపక్షాలు పార్టీలు దూకుడుపెంచాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తుపై జేడీఎస్ కీలక ప్రకటన చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని పార్టీ తెగేసి చెప్పింది. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని జేడీఎస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. జేడీఎస్ అభ్యర్థులు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తారని, కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ట్వీట్‌లో జేడీఎస్ పేర్కొంది. దీంతో ఉప ఎన్నికల పోరు మూడు పార్టీల మధ్య రసవత్తరంగా జరగనుంది.
కాగా జేడీఎస్ ప్రకటనపై కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించలేదు. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే . అక్టోబర్ 21న ఎన్నికలు జరుగనుండగా, 24న ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని జేడీఎస్ అధినేత దేవెగౌడ గతంలో జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ప్రసక్తే ఉండదని కూడా తేల్చిచెప్పారు. జనవరి, ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు ఉండొచ్చని, ఈసారి మాత్రం చేతులు కాల్చుకునేది లేదని, పొత్తు మాటే తలెత్తదని ఆయన చెప్పారు.
చదవండి: మోగిన ఎన్నికల నగారా