సూదిమొనంతా లేదు | No role of TRS in Telangana formation: Ghulam Nabi Azad | Sakshi
Sakshi News home page

సూదిమొనంతా లేదు

Published Fri, Sep 21 2018 1:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

No role of TRS in Telangana formation: Ghulam Nabi Azad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ పాత్ర సూదిమొనంత కూడా లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కేసీఆర్‌ లేదా టీఆర్‌ఎస్‌ నేతలను తాము ఎప్పుడూ అడగలేదని, కనీసం వారి తో మాట్లాడలేదన్నారు.

ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మాట్లాడి మాత్రమే పార్టీ అధిష్టానం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మ ద్, శ్రీనివాస కృష్ణన్‌లతో కలసి ఆజాద్‌ విలేకరులతో  మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగిన చర్చల పరంపరను వివరించారు.

ప్రజల ఆకాంక్షల ప్రకారమే తెలంగాణ ఇచ్చాం
‘రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. నేనే అందరితో చర్చలు జరిపా. ప్రాంతాలవారీగా పార్టీ నేతలతో డజన్లసార్లు సమావేశమయ్యా. ఆ చర్చల్లో తెలంగాణ కి చెందిన పార్టీ నేతలు ప్రత్యేకించి ఎంపీలు రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని ఒత్తిడి తేవడంతోపాటు గొడ వ చేశారు. అధికార పార్టీలో ఉండి వారు పార్లమెం టు కార్యకలాపాలను స్తంభింపజేశారు.

ఆంధ్రా ప్రాంత కాంగ్రెస్‌ నేతలు మాత్రం నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేశారు. రాష్ట్రం ఏర్పాటు చేశాక మాత్రం ఆందోళనకు దిగారు. మీరే హైకమాండ్‌ ఇష్టమన్నారు కదా అని అడిగితే హైకమాండ్‌ తెలంగాణ ఇవ్వదని భావించి అలా చెప్పామన్నారు.తెలంగాణ నేతలు, ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం మేము ఒక్కసారి కూడా ఇప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడలేదు. ఈ నిర్ణయం తీసు కోవడంలో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదు.

ఒకవేళ వాళ్ల పాత్ర ఏదైనా ఉందనుకుంటే ఎప్పుడు, ఎవరు, ఎలాంటి హామీ ఇచ్చారో, చర్చలు జరిపారో చెప్పాలని టీఆర్‌ఎస్‌ను చాలెంజ్‌ చేస్తున్నా’ అని ఆజాద్‌ వ్యాఖ్యానించారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పం టను దళారి దోచుకున్నట్టు టీఆర్‌ఎస్‌ వ్యవహరించిం దని విమర్శించారు. ‘తెలంగాణ కోసం విత్తనాలు వేసింది మేము. దుక్కి దున్నింది మేము. పంట పం డించింది మేము. పంటను కోసుకెళ్లింది మాత్రం టీఆర్‌ఎస్‌’అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తారని ఆశిస్తున్నామన్నారు.

దొందూ దొందే!: అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ దొందూ దొందేనని, ఇద్దరూ యువతను పూర్తిగా వంచించారని ఆజాద్‌ దుయ్యబట్టారు. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ కనీసం సీఎం అయ్యే నాటికి ఉన్న ఖాళీలనూ భర్తీ చేయలేకపోయారని మండిపడ్డారు.

ఉన్న ఉద్యోగాలనే భర్తీ చేయలేని ఆయన కొత్త ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారని నిలదీశారు. అలాగే ఐదేళ్ల లో 10 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ ఇప్పటివరకు 5–6 లక్షల ఉద్యోగాలే కల్పించగలిగారని విమర్శించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ఒక్కటే ఇస్తే సరిపోదని, వారు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే నిజమైన ఉపశమనమని ఆజాద్‌ అభిప్రాయపడ్డారు. మద్దతు ధర కేవలం కాగితాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ..?
కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి గుజరాత్‌ వరకు లక్షలాది మంది విద్యార్థులు తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు గతంలో వచ్చి ఉన్నత విద్య అభ్యసించే వారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆజాద్‌ పేర్కొన్నారు. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం అయ్యాక స్థానిక విద్యార్థులు, బయటి నుంచి వచ్చి చదువుకుంటున్న వారు ఇబ్బందుల పాలవుతున్నారని, మిగులు బడ్జెట్‌ ఉన్నా రా>ష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు.

ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు నిలిపివేయడం వల్ల 50–70 శాతం విద్యా సంస్థలు నిర్వీర్యమైపోయాయని, 70–75 శాతం మంది సాంకేతిక విద్యకు దూరమయ్యారని ఆజాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదలకు కట్టిస్తామని చెప్పిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

ముస్లింలకు రిజర్వేషన్లు వైఎస్సార్‌ ఘనతే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని ఆజాద్‌ కొనియాడారు. అప్పుడు అమల్లోకి వచ్చిన 4 శాతం రిజర్వేషన్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయన్నారు. ‘2004 ఎన్నికల ప్రచారంలో నేను రెండు హామీలిచ్చాను. అప్పుడు మా సిట్టింగ్‌ స్థానాలను కూడా పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌కు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో మా నేతల్లో అసంతృప్తి వచ్చింది. వారందరినీ ఎమ్మెల్సీలు చేస్తామని చెప్పాను. అందుకోసం కౌన్సిల్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చాను.

ఆ తర్వాత ముస్లిం రిజర్వేషన్ల గురించి కూడా చెప్పాను. దక్షిణా దిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కర్ణాటకకన్నా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. అందుకే అక్కడ 4 శాతం రిజర్వేషన్లు ఉంటే ఏపీలో 5 శాతం ఇస్తామని హామీ ఇచ్చాను. ఇదే విషయాన్ని ఆంధ్రా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అప్పటి మా ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌కు ఫోన్లో చెప్పాను. ఆయన కూడా సమ్మతించి అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.

కానీ దీనిపై కొందరు కోర్టుకెళ్లడంతో దాన్ని 4 శాతం చేయాల్సి వచ్చింది. ఆ 4 శాతమే ఇప్పటివరకు కొన సాగుతోంది. మేం 5 శాతం ఇచ్చినప్పుడే కోర్టు అంగీ కరించలేదు. ఇప్పుడు 12 శాతం అంటే కూడా ఒప్పుకోదని కేసీఆర్‌కు బాగా తెలుసు. అమలు సాధ్యం కాదని తెలిసీ ఆయన అబద్ధాలు చెప్పి మోసం చేశారు. అధికారంలోకి వస్తే హుస్సేన్‌సాగర్‌ నీటిని పాలలాగా మారుస్తామంటూ ఇచ్చే తప్పుడు హామీ ఎలాంటిదో ముస్లింలకు 12% రిజర్వేషన్‌ ఇస్తామం టూ కేసీఆర్‌ ఇచ్చిన హామీతోనే నిలువునా మోసం చేశారు’ అని ఆజాద్‌ వ్యాఖ్యానించారు.  

టీఆర్‌ఎస్‌దే కుటుంబ పాలన
టీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తుంటే గాంధీ కుటుంబం కూడా కాంగ్రెస్‌ను, దేశాన్ని ఏలిందని టీఆర్‌ఎస్‌ నేతలంటున్నారు కదా అని ప్రశ్నించగా గాంధీ కుటుంబ పాలనకు, టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనకు చాలా తేడా ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఆజాద్‌ కోరారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన నెహ్రూ ప్రధాని అయ్యారని, ఆయన మరణించాక ఇందిరాగాంధీ, ఆమె చనిపోయాకే రాజీవ్‌గాంధీ ప్రధానులు అయ్యారన్నారు.అంతే తప్ప కేసీఆర్‌ నియమించినట్లుగా కొడుకు, అల్లుడు మంత్రులుగా, కూతురు ఎంపీ కాలేదన్నారు.

ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదన్నప్పుడు తెలంగాణ ఇచ్చాక ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించగా తామెప్పుడూ టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయమని అడగలేదని ఆజాద్‌ చెప్పారు. ఆ విషయం కూడా కేసీఆరే చెప్పారని, పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తానని, అవసరమైతే రాజకీయాల్లోనే ఉండనని కేసీఆర్‌ చెప్పారని, ఈ విషయంలోనూ కేసీఆర్‌ మోసం చేశారన్నారు.
 

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
బీజేపీతో వ్యవహరించే విషయంలో టీఆర్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆజాద్‌ మండిపడ్డారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి విషయాల్లో దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలవగా టీఆర్‌ఎస్‌ మాత్రం బీజేపీకి మద్దతు పలికిందని ఆయన గుర్తుచేశారు. రాజ్యసభ చైర్మన్‌ ఎన్నిక విషయంలోనూ టీఆర్‌ఎస్‌ అదే చేసిందని, బయట మాత్రం బీజేపీపై గొడవ చేస్తున్నట్లు నటించిందని విమర్శించారు. కేసీఆర్‌ చెప్పే ప్రతి మాట, వేసే ప్రతి అడుగులోనూ అబద్ధం ఉంటుందన్నారు.

నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో కేంద్రం చేసింది తప్పయితే అందులో టీఆర్‌ఎస్‌ పాత్ర కూడా ఉంటుందని, ఆ రెండు పార్టీలూ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆజాద్‌ దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఎంఐఎంను సర్కారీ పార్టీగా ఆయన అభివర్ణించారు. అధికారంలో ఎవరుంటే వారితో కలసి ఒవైసీ వెళ్తారన్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు గురించి ప్రశ్నించగా వివిధ రాష్ట్రాల్లోని పార్టీల మధ్య పొత్తులకు అంగీకారం తెలపాల్సిన ఐదుగురు సభ్యుల అధిష్టాన కమిటీలో తానూ సభ్యుడినని, ఇప్పటివరకు అధిష్టానం వద్ద ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement