సీఎం సిద్ధరామయ్య
రాబోయే రోజుల్లో ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర నిధుల కేటాయింపు విషయంలో తమ రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన వాటా రావడం లేదనే భావనలో దక్షిణాది నాయకులున్నారు. రాష్ట్రాలకు 1971 జనాభా లెక్కలకు బదులు 2011 జనాభా గణన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర పన్నుల రాబడిని ( సెంట్రల్ టాక్స్ రెవెన్యూ) పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం సిఫార్సు చేయడం మళ్లీ మాటల యుద్ధానికి తెర లేపింది. కేంద్రం సిఫార్సు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని, దీనిని తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నేతలు అడ్డుకోవాలంటూ శుక్రవారం కర్నాటక సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.
ఈ మేరకు చేసిన ట్వీట్‌ను ఆయా రాష్ట్రాల సీఎంఓలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కూడా ఆయన ట్యాగ్ చేశారు. ఇదే సెంటిమెంట్‌ను వ్యక్తం చేస్తూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పది బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. పదహేనో∙ఆర్థిక సంఘం పరిశీలనలోని కొన్ని పరిశీలనాంశాలు (టీఓఆర్) లోపభూయిష్టంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వీటి వల్ల రాష్ట్రాలకు కేంద్ర పన్నుల రాబడి సమాన ంగా∙పంపిణీ చేయడం పై ప్రభావం పడుతుందని, ఈ రాష్ట్రాలకు మున్సిపాలిటీల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందని స్టాలిన్ పేర్కొన్నారు.
2011 జనాభా లెక్కలతో నష్టం ?
కేంద్ర పన్నుల రాబడి (టాక్స్ రెవెన్యూ)ని ప్రతీ అయిదేళ్లకు వివిధ రాష్ట్రాలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలనే అంశాన్ని రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన కేంద్ర పన్నుల్లో 42 శాతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తారు. మిగతా 58 శాతాన్ని జాతీయ అవసరాల కోసం కేంద్రం వినియోగిస్తుంది. వివిధ రాష్ట్రాలకు కేటాయించే 42 శాతం నిధులపై ఆర్థికసంఘం నిర్ణయిస్తుంది. గతేడాది నవంబర్ 27న ఎన్‌కే సింగ్ అధ్యక్షతన 15వ ఆర్థికసంఘాన్ని కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ఫైనాన్స్ కమిషన్ 2020–25 కాలానికి సంబంధించిన పన్నుల కేటాయింపుపై వచ్చే ఏడాది అక్టోబర్ 30 లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది.
అయితే 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా కమిషన్ సిఫార్సు చేస్తుందని టీఓఆర్‌లో పేర్కొన్నారు. గతంలో ఇందుకు 1971 సెన్సస్ వివరాలను ( ఈ జనాభా లెక్కల తర్వాతే దేశంలో కుటుంబనియంత్రణ విధానాలు వేగవంతం చేయడంతో) ప్రామాణికంగా తీసుకునేవారు. ఈ డేటా ప్రకారమే 1976లో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచారు. నియోజకవర్గాల సంఖ్య మార్చకుండా 2008లో పునర్విభజన జరిగింది. 2026 తర్వాత(2031) జరిగే జనాభా లెక్కల ఆధారంగానే మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. 2011 జన గణన ప్రకారం సమకాలీన భారత్‌లో ఉత్తర,దక్షిణ రాష్ట్రాల మధ్య తేడాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి.
ఆర్థికాభివృద్ధి రేటు, నాణ్యమైన జీవనం, ప్రభుత్వపాలన, జనాభా, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. 1991లో సరళీకర ఆర్థిక విధానాల అమలు మొదలయ్యాక ఆ తర్వాతి ఇరవై ఏళ్లలో ఉత్తరప్రదేశ్,బీహార్‌లలో కలిపి 25 శాతం జనాభా పెరుగుదల రికార్డయింది. అదే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కేరళల్లో కలిపి 12 శాతమే జనాభా పెరిగింది. ఈ రెండు దశాబ్దాల్లో కేరళలో 5 శాతం జనాభా వృద్ధి కాగా బిహార్‌లో ఎన్నోరెట్లు పెరిగింది. జాతీయ సగటు, దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల సగటు కంటే కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధికశాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమైంది.
దక్షిణాదిపై చిన్నచూపా ?
1971–91 సంవత్సరాల మధ్య ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు పెరిగిందని, తమ రాష్ట్రాల్లో క్రమేణా తగ్గుతూ వస్తోందనేది దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా వాదిస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం లెక్కిస్తే రాష్ట్రాలకు కేంద్రనిధులు గణనీయంగా తగ్గిపోతాయన్నది సిద్ధరామయ్య, స్టాలిన్ వంటి నేతల «నిశ్చితాభిప్రాయం. సంతానోత్పత్తి శాతాన్ని తగ్గించేందుకు, అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు దక్షిణాది రాష్ట్రాలు విద్య, ఆరోగ్య పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నందుకు కేంద్రం శిక్షిస్తున్నట్టుగా ఇది ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
1971–2011 మధ్య ఉత్తరప్రదేశ్‌లో 138. 02 శాతం, జమ్మూ,కశ్మీర్‌లో 171.82 శాతం జనాభా వృద్ధితో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగిందని,అదే తమిళనాడులో 56 శాతం, కేరళలో 75 శాతమే వృద్ధి చెందిందని గణాంకాలు ఉటంకిస్తున్నారు. యూపీ, బిహార్‌లతో పోల్చితే కేరళ, తమిళనాడు మహిళా అక్షరాస్యత గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల యూపీలో రూ. 36 వేల కోట్లతో రైతు రుణమాఫీని ప్రకటించడంతో (ఆ రాష్ట్రం రూ.50 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నా) దీనిని అమలు చేసేందుకు అవసరమైన రుణాలకు కేంద్రమే పూచీ ఉండాల్సి రావడాన్ని ఎత్తిచూపుతున్నారు.
అయితే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రాలకు వచ్చే కేంద్ర పన్నుల వాటాలో పెద్దగా ప్రభావం పడదని ఆర్థికసంఘం అధ్యక్షుడు ఎన్‌కే సింగ్ చెబుతున్నారు. పదిహేనో ఆర్థికసంఘం పరిశీలనాంశాల (టీఓఆర్)ను సమర్థిస్తూ జనాభా వృద్ధిని అదుపు చేసే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నందున ఈ రాష్ట్రాల లెక్క సరిచేసినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment