కేసీఆర్‌ను సన్మానిస్తున్న దేవెగౌడ చిత్రంలో కుమార
సాక్షి, బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బెంగళూరు పర్యటన విజయవంతంగా ముగిసింది. సీఎం కేసీఆర్ ఒక్కరోజు బెంగళూరు పర్యటన అనేక అంచనాలు ఊహగానాలకు దారి తీసింది. తృతీయ కూటమి ఏర్పాటు ప్రధాన లక్ష్యంతో రాష్ట్రంలో అడుగిడినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాడీవేడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన రాష్ట్రంలో విశిష్టతనుసంతరించుకుంది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తృతీయ కూటమి ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల్లోనూ ఆ పార్టీల ఓటమికి కృషి చేస్తారని అంచనాలు మొదలయ్యాయి. తొలుత కర్ణాటకలో ఎన్నికల్లో జేడీఎస్‌ను గెలిపించి కేసీఆర్ శక్తి ఏంటో ఆ పార్టీలకు హెచ్చరికలు పంపే అవకాశాలు లేకపోలేదని స్థానిక నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. శుక్రవారం జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడతో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు. ఆయన నేరుగా బెంగళూరు పద్మనాభనగర్‌లోని దేవెగౌడ నివాసానికి చేరుకుని అధినేతతో భేటీ అయ్యారు. దీంతో శుక్రవారం రాజకీయ వర్గాల్లో ఆయన భేటీపై బహిరంగంగానే చర్చ జరిగింది.
దేశవ్యాప్తంగా వరుస భేటీలు..
ఇటీవల కాలంలో దేశ రాజకీయాల్లో మార్పు అనివార్యమంటూ కేసీఆర్ వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యాన్ని నివారించాలంటే తృతీయ కూటమి తప్పక అవసరమని ఆయన దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఇప్పటికే తృతీయ కూటమిలో భాగస్వామ్యం కావాలని ప్రాంతీయ పార్టీలకు ఆయన పలు వేదికల్లో పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మార్చి 19న కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమై తృతీయ కూటమికి మద్దతును కోరారు. అంతేకాకుండా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను కలసి కేసీఆర్ తృతీయ కూటమిపై మద్దతు కోరారు. త్వరలోనే ఒడిశాకు చెందిన బిజు జనతాదల్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దేవెగౌడతో సమావేశమయ్యారు. దేవెగౌడతో భేటీలో భాగంగా తృతీయ కూటమి ఏర్పాటు ఉద్ధేశాలను కేసీఆర్ వివరించినట్లు సమాచారం. అంతేకాకుండా తృతీయ కూటమి ఏర్పాటుపై రాజకీయ భీష్ముడు దేవెగౌడ సలహాలు, సూచనలను తీసుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం..
శుక్రవారం వీరి భేటీలో భాగంగా రాష్ట్ర ఎన్నికలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల్లో జేడీఎస్ అనుసరిస్తున్న వైఖరిని, పార్టీ విజయావకాశాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా అవసరమైతే జేడీఎస్ తరపున హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలో కేసీఆర్ ప్రచారం చేసేందుకు కూడా అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే నటుడు పవన్ కల్యాణ్ రూపంలో స్టార్ క్యాంపెయినర్ జేడీఎస్‌కు అండగా నిలుస్తారని వార్తలు గుప్పుమన్నాయి. పవన్ జేడీఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తారని ఊహగానాల మధ్య ఇక కేసీఆర్ కూడా ప్రచారం నిర్వహిస్తే ఊహించిన దానికంటే అత్యధిక స్థానాల్లో జేడీఎస్ గెలవడం ఖాయంగా కనపడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేసీఆర్ తన మాటల గారడీతో కాంగ్రెస్, బీజేపీలకు చెమటలు పట్టించగలరని ప్రతిపక్షాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతివ్వాలని కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment