చాడ వెంకట్ రెడ్డి, ఉత్తమ్ , ఎల్ రమణ, కోదండ రాం
హైదరాబాద్: ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కామన్ పోగ్రాం అజెండాపై చర్చించామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్, తెలంగాణ జన సమతి, టీడీపీ, సీపీఐ పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో కామన్ అజెండా ఫైనల్ చేసి, ఆ తర్వాత విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు సీట్ల చర్చ జరగలేదని వివరించారు. కేసీఆర్ ఏం చేసినా ఓటమి ఖాయమన్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి సీట్ల సర్దుబాటు ఫైనల్ అవుతుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూలే ఇంకా ప్రకటించలేదు..సీట్లు, మ్యానిఫెస్టో గురించి తొందరపాటు ఎందుకని అన్నారు. వివిధ పార్టీలకు వివిధ మ్యానిఫెస్టోలు ఉంటాయి కాబట్టి అందరం కలిసి చర్చించి ముందుకు వెళ్తామన్నారు.
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలకి అనుగుణంగా కామన్ అజెండా ఉంటుందని వెల్లడించారు. ఈ కూటమి మహాకూటమి కాదని, దీనికి ఇంకా పేరు పెట్టలేదని చెప్పారు. బీజేపీతో వెళతారన్న ప్రశ్నకి కోదండరాం సమాధానం దాటవేశారు. సీట్లపై ఇంకా చర్చ జరగలేదని చెప్పారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల అజెండా అమలు చేస్తామని వివరించారు. కోడ్ అమలులో ఉండగా మంత్రులు ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. ఒక అవగాహనకు రాకుండా ఏ పార్టీ వాళ్లు ప్రచారం చేసుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలు నిరాశతో ఉన్నారు..అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో ఉంటుందన్నారు.
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ... కేసీఆర్ అన్ని వర్గాల వారిని మోసం చేశారని విమర్శించారు. నష్టపోయిన అన్ని వర్గాల వారికి మ్యానిఫెస్టోలో న్యాయం చేస్తామని అన్నారు. తమది గ్రాండ్ అలయన్స్ అన వ్యాఖ్యానంచారు.
Comments
Please login to add a commentAdd a comment