దేశంలో సుదీర్ఘకాలం అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏంటి? కేంద్రంలోనూ.. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయి బక్కచిక్కిన హస్తం పార్టీకి మళ్లీ పూర్వవైభవం సాధ్యమేనా? రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తులుగా ఎదిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించాలంటే ఆయా ప్రాంతీయ పార్టీల పంచన చేరాల్సిందేనా? ఇటీవల జరిగిన అనేక ఉపఎన్నికల్లో కమలం పార్టీ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది.
బీజేపీపై మిత్రుల అసంతృప్తి ఒకవైపు.. బీజేపీయేతర పార్టీలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థులను నిలబెడుతుండటం మరోవైపు.. ఈ పరిస్థితుల్లో బీజేపీ భవిష్యత్తు ఏమిటి? మొత్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గరకొచ్చేవేళ.. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ‘సమర్థ్ సంపర్క్’పేరుతో మేధావి వర్గాన్ని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెడితే.. నిన్న మొన్నటి వరకూ ఉప్పునిప్పులా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యే పని మొదలుపెట్టాయి.
కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు 14 పార్టీలకు చెందిన సీఎంలు, నేతలు చేయి చేయి కలపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఫలితాలు ఎలా ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆరు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ!
రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే అధికారం మారుతోంది. ఈ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పక్షాలు ఉన్నా వాటికి దక్కే అసెంబ్లీ సీట్లు నామమాత్రమే. బీఎస్పీకి గతంలో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు బలముండేది. కానీ ఇటీవల పరిస్థితి మారింది. ఈ ఆరు రాష్ట్రాల్లో మొత్తం 101 లోక్‌సభ స్థానాలుంటే అందులో రెండే స్థానాలున్న గోవాలోనే ప్రాంతీయపక్షాలకు కొంతబలం ఉంది.
రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఇటీవలే పూర్తయిన రెండు సర్వేలు స్పష్టం చేశాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీఎస్పీకి ఒకప్పుడు ఒక మోస్తరు బలం ఉండేదిగానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పైగా హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నా బీజేపీకి పెద్దగా నష్టం లేదని 2014 ఎన్నికల్లో ఆ పార్టీలకు పోలైన ఓట్లు సూచిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఈ రెండు పార్టీల పొత్తుతో బీజేపీకి రెండు లోక్‌సభ స్థానాల నష్టం జరగవచ్చని అంచనా. మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీ నాలుగు సీట్లు కోల్పోయే అవకాశముంది.
దక్షిణాదిన కర్ణాటకలోనే పొత్తుకు అవకాశం!
కేరళలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఏ ఎన్నికల్లోనూ వామపక్షాలు, కాంగ్రెస్ చేతులు కలపడానికి ఆస్కారం లేదు. సంఘ్ పరివార్ పెద్ద ఆరెస్సెస్ దన్నుతో బీజేపీ విస్తరిస్తున్నా ఒంటరిపోరులో ఒక్క లోక్‌సభ సీటు కూడా దానికి దక్కే అవకాశాలులేవు. గత సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం లబ్ధి పొందింది. ఆ పార్టీ ఇటీవల కాషాయపక్షంతో తెగదెంపులు చేసుకుని కేంద్రంలోని ఎన్డీఏ నుంచి వైదొలిగింది. తెలంగాణలో పాలకపక్షం టీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ వ్యతిరేకమే.
బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్‌కే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూలం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ దాదాపుగా అస్థిత్వం కోల్పోయింది. తమిళనాడులో సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్ పార్టీలు, పాలక ఏఐఏడీఎంకే ఎవరితో పొత్తు పెట్టుకుంటాయో తెలియనిస్థితి. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం నామమాత్రమే. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు కొనసాగవచ్చు. పుదుచ్చేరితో కలిపి 130 లోక్‌సభ సీట్లున్న దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు వీలుంది.
ఒడిశా, బెంగాల్‌లో నామమాత్ర ప్రభావం
ప్రాంతీయ పక్షమైన బిజూ జనతాదళ్(బీజేడీ) 18 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఆరంభంలో బీజేపీతో చేతులు కలిపిన బీజేడీ నేత నవీన్ పట్నాయక్ 2009లో దానితో తెగదెంపులు చేసుకున్నారు. తర్వాత బీజేపీ బలహీనపడి 2014లో ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతాయే తెరవలేదు. అయితే ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేడీ తర్వాత స్థానం బీజేపీ సంపాదించింది.
కానీ, టీఆర్‌ఎస్ మాదిరిగానే బీజేడీ కూడా కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ సమాన దూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహారశైలి సీపీఎం నాయకత్వంలోని వామపక్షాలు తృణమూల్‌తో జతకట్టడానికి అనుకూలంగా లేవు. మొత్తం 63 సీట్లున్న ఈ తూర్పు రాష్ట్రాల్లో కూడా బీజేపీ వ్యతిరేక మహా కూటమి ఏర్పడినా కాంగ్రెస్‌కు లభించే ప్రయోజనం అంతంత మాత్రమే.
ఈశాన్యంలో అస్సాం, త్రిపురలోనే చాన్స్!
24 లోక్‌సభ సీట్లున్న ఈశాన్యంలో అస్సాం(14), త్రిపుర(2)లోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు అవకాశాలున్నాయి. అస్సాంలో 2014లో మోదీ ప్రభంజనంతో ఏడు లోక్‌సభ సీట్లు సంపాదించిన బీజేపీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఏజీపీ, బీపీఎఫ్‌తో కలసి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఈ రెండు ఎన్నికల్లోనూ బాగా దెబ్బతింది. ముస్లింల పార్టీగా అవతరించిన ఏఐయూడీఎఫ్ విడిగా పోటీ చేయడంతో బీజేపీ బాగా లబ్ధి పొందింది. ఈసారి బీజేపీ కూటమిని ఓడించాలంటే ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకతప్పదు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 36.5, కాంగ్రెస్‌కు 29.6, ఏఐయూడీఎఫ్‌కు 15 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ జతకడితే అత్యధిక సీట్లు సాధించే వీలుంది. వామపక్షాల కంచుకోట త్రిపురలో ఓ ఆదివాసీ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 51.6, వామపక్ష కూటమికి 46.7, కాంగ్రెస్‌కు 1.8 శాతం ఓట్లు లభించాయి. ఇదే తరహాలో లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీలకు ఓట్లు దక్కే పక్షంలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు.
యూపీలో కొంత ప్రయోజనం.. బిహార్‌లో అనుమానం
మొత్తం 120 లోక్‌సభ సీట్లున్న ప్రధాన హిందీ రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లో ఒక్క యూపీలోనే బీజేపీయేతర పార్టీలు ఎస్పీ, బీఎస్పీ, మరో చిన్న ప్రాంతీయపక్షం ఆర్‌ఎల్‌డీ కలసి బక్కచిక్కిపోయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ విషయం గోరఖ్‌పూర్, ఫూల్పుర్ ఉపఎన్నికలు నిరూపించాయి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 41.3, ఎస్పీ 28, బీఎస్పీ 22, కాంగ్రెస్ 6 శాతం ఓట్లు సాధించాయి. అంటే బీజేపీయేతర పార్టీల ఓట్లు 56 శాతం దాటిపోయాయి.
బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను నిలిపితే మూడొంతుల సీట్లు కైవసం చేసుకోవచ్చు. బిహార్‌లో మూడేళ్ల తర్వాత బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో తన సంకీర్ణ మిత్రపక్షాలైన బీజేపీ, ఎల్జేపీ, ఆర్‌ఎలెస్పీతో కలసి పోటీచేస్తే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించవచ్చని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. 14 సీట్లున్న పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లో పాలక కూటమి బీజేపీ–ఏజేఎస్‌యూపై కాంగ్రెస్, జేఎంఎం ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
పంజాబ్, హరియాణా, ఢిల్లీ, కశ్మీర్‌లో..
బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న హరియాణాలో ప్రధాన ప్రతిపక్షం ఐఎన్‌ఎల్డీ, కాంగ్రెస్, ఆరెల్డీ కలసి పోటీ చేస్తే బీజేపీకన్నా ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవచ్చు. ఢిల్లీలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పాలకపక్షమైన ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ తదితర కమలం వ్యతిరేక పార్టీలు చేతులు కలిపితే అత్యధిక సీట్లు గెలిచే వీలుందని అంచనా. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 46.4, ఆప్ 32.9, కాంగ్రెస్ 15.1 శాతం ఓట్లు సంపాదించాయి.
ఆప్, కాంగ్రెస్ ఓట్లు కలిస్తే బీజేపీని ఓడించవచ్చని ఓట్ల వివరాలు సూచిస్తున్నాయి. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(38.5), ఆప్(23.7)కు పడిన ఓట్లు దాదాపు 60 శాతం. ఈ రెండు పార్టీలూ బీఎస్పీతో కలసి పోటీ చేస్తే అకాలీదళ్–బీజేపీ కూటమిని ఒకట్రెండు సీట్లకే పరిమితం చేయవచ్చు. పీడీపీ–బీజేపీ సంకీర్ణ సర్కారు పాలన సాగుతున్న జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి మాదిరిగానే రెండు జాతీయ పక్షాలతో రెండు ప్రాంతీయ పార్టీల పొత్తు కొనసాగితే ఫలితాల్లో చెప్పుకోదగ్గ మార్పులుండకపోవచ్చు.
కలసి పోటీచేస్తే గెలుపు ఖాయం కాదు..
బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఎలాంటి సైద్ధాంతిక సారూప్యం లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీచేస్తే గెలుపు సాధ్యం కాదని పాత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో వివిధ పార్టీలు సాధించిన ఓట్లను కూడికలు, తీసివేతలతో కొత్త లేక్కలేసి రాబోయే ఎన్నికల ఫలితాలను అంచనావేయడం సరికాదని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఎలాంటి ఉమ్మడి కార్యాచరణ లేకుండా క్షేత్ర స్థాయి పరిస్థితులతో పనిలేకుండా వివిధ పార్టీలు పెట్టుకునే పొత్తులు పనిచేయవని కూడా కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాలకపక్షంగా కొనసాగిన కాలం నాటి ఎన్నికలు నిరూపించాయి.
మిత్రపక్షాలను సంప్రదించాలంటున్న జేడీయూ, లోక్‌జనశక్తి
బిహార్ సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పార్టీ జేడీయూ జోకీహాట్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓడిపోవడంతో బీజేపీపై ఆ పార్టీ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఇంధన ధరలు పెరగడం, కీలక విషయాల్లో బీజేపీ నేతలు ఎన్డీఏ మిత్రపక్షాలతో సంప్రదించకపోవడాన్ని నితీశ్, జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి తప్పుబట్టారు.
బిహార్‌కు చెందిన మరో ఎన్డీఏ భాగస్వామి లోక్‌జనశక్తి కూడా మిత్రపక్షాలను బీజేపీ పట్టించుకోవాలని, ఆధిపత్య ధోరణి విడనాడాలని చెబుతోంది. ఇదే రాష్ట్రానికి పరిమితమైన మరో చిన్న భాగస్వామి రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ నేత, కేంద్రమంత్రి ఉపేంద్ర కాష్వాహా కూడా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడానికి బీజేపీ నాయకత్వం మిత్రులతో చర్చించి విధానాలు రూపొందించాలని, పెద్దన్నలా వ్యవహరించడం మానుకోవాలన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మిత్రపక్షం తెలుగుదేశం ఇటీవల ఎన్డీఏ నుంచి బయటపడింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమనేలా వ్యవహరిస్తోంది. మొదట్నించీ కాంగ్రెస్, బీజేపీలను సమానంగా వ్యతిరేకించిన ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి వెనకాడననే రీతిలో మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ ముక్త్ భారత్..
2014 పార్లమెంటు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను ఓడించడం అలవాటుగా మారింది. లోక్‌సభలో 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ను మరింత బలహీనం చేయడానికి మోదీ–షా ద్వయం ప్రతి ఎన్నికల్లోనూ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే నినాదాన్ని తెర మీదకు తెచ్చింది. ఈ క్రమంలో ప్రతిపక్షాలులేని దేశంగా మార్చడానికి ఈ అగ్రనేతలిద్దరూ ప్రయత్నిస్తున్నారని గ్రహించిన కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు ఏకం కావడం కిందటేడాదే మొదలైంది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు పనిచేయలేదు. ఈ ఏడాది యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీకి బీఎస్పీ మద్దతు పలకడం, బీజేపీని ఓడించడంతో ప్రతిపక్షాల ఐక్యతకు ప్రాచుర్యం లభించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర ప్రతిపక్షాల మధ్య పొత్తు ప్రయత్నాలు ఫలించలేదు. మళ్లీ యూపీ ఉపఎన్నికల్లో(కైరానా, నూర్పూర్) ప్రతిపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలిపి విజయం సాధించడంతో బీజేపీకి కొత్త సవాల్ ఎదురైంది.
ప్రతిపక్షాల మధ్య అనైక్యతను నాలుగేళ్లగా ఉపయోగించుకున్న కాషాయ పక్ష నేతలు తమ దూకుడుతో ప్రతిపక్షాల మధ్య కొత్త ఐక్యతకు పరోక్షంగా కారకులయ్యారు. ఫలితంగా ఒకవైపు ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని, మరోవైపు ప్రతిపక్షాల మధ్య రోజురోజుకు వెల్లివిరుస్తున్న ఐకమత్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు బీజేపీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వాన ప్రతిపక్షాలు ఏకమవ్వడానికి ఇంకా ఏడాది సమయం ఉండడం కూడా కమలం నేతలను అలజడికి గురిచేస్తోంది.
పడిపోతున్న బీజేపీ ఓట్ల శాతం
కిందటి లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఏడు లోక్‌సభ సీట్లు కోల్పోవడమేగాక దాని ఓట్ల శాతం కూడా ఆందోళన కలిగించే రీతిలో పడిపోయింది. అంతకుముందు బీజేపీ గెలుచుకున్న నాలుగు పార్లమెంటు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రెండు సీట్లను ఎస్పీ, ఒక సీటును ఆర్‌ఎల్‌డీ కైవసం చేసుకున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో 2014లో బీజేపీకి లభించిన 51.4 శాతం ఓట్లు మరుసటి ఏడాది ఉపఎన్నికలో పది శాతం తగ్గి 40.8 శాతానికి పడిపోయాయి. పంజాబ్‌లో కిందటేడాది జరిగిన గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికలో కూడా బీజేపీ ఓడిపోవడమేగాక పది శాతం తక్కువ ఓట్లు సంపాదించింది. రాజస్తాన్‌లోని ఆల్వార్, అజ్మేర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటమితోపాటు ఓట్ల శాతం తగ్గిపోయింది.
ఈ ఏడాది యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ ఉపఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లు వరుసగా 5.2, 13.6 శాతం చొప్పున తగ్గిపోయాయి. ఈ రెండు సీట్లు ౖకైవసం చేసుకున్న ఎస్పీ రెండుచోట్లా తన ఓట్ల శాతాన్ని పాతికకు పైగానే పెంచుకోగలగడం బీజేపీకి ఆందోళన కలిగించే అంశం. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 13 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎనిమిది సీట్లు కోల్పోయింది. కశ్మీర్‌లో సంకీర్ణ భాగస్వామి పీడీపీ ఒక సీటు పోగొట్టుకుంది.
గళమెత్తుతున్న భాగస్వాములు!
ఇటీవల నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల కారణంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీఏలో బీజేపీపై మిత్రపక్షాల నుంచే బాహాటంగా విమర్శలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికలు ఏడాదిలోపే ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలకు ఇంటాబయటా మున్నెన్నడూ లేని ఇబ్బందికర పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది.
రెండుమూడేళ్లుగా దేశంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ప్రగతి బాటలో లేదనే భావనతోపాటు ఇటీవల పెట్రో ధరలు అడ్డగోలుగా పెరగడంతో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతోపాటు ఎన్డీఏ మిత్రులు జతకలవడం బీజేపీని రాజకీయ సంక్షోభం దిశగా నడిపిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే తర్వాతి ఉపఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోవడం కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతోంది.
రెండేళ్ల క్రితమే బీజేపీకి మానసికంగా దూరమైన ప్రధాన భాగస్వామ్య పక్షం శివసేన భవిష్యత్తు ఎన్నికల్లో కమలం పార్టీతో పొత్తు ఉండదని ప్రకటించింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఈసీ తోడ్పాటుతో, రిగింగ్ చేసి బీజేపీ గెలిచిందనే వరకూ ఈ పార్టీ నేత ఉద్ధవ్ ఠాక్రే వెళ్లారు. అయితే, అమిత్‌షా మిత్రపక్షాలను బుజ్జగించే పని వెంటనే ప్రారంభించారు. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో భేటీ అయ్యారు. మరో వైపు అకాలీదళ్ డిమాండ్లను తీర్చడం ప్రారంభించారు. బిహార్‌లోనూ సంకీర్ణ మిత్రపక్షాలతో విభేదాలు తొలగించుకోవడానికి బీజేపీ నాయకత్వం పట్నాలో సమావేశం జరిపింది.
- కథనాలు సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment