పి.చిదంబరం
న్యూఢిల్లీ: బీజేపీ అతిక్రమణలు, ప్రధాని మోదీ వ్యాఖ్యలు, ఆ పార్టీ పెద్దయెత్తున చేస్తున్న నగదు వ్యయంపై ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. మొత్తం మీద యావత్ భారతావనిని ఈసీ విఫలం చేసిందని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రజలేమైనా జాతి వ్యతిరేకశక్తులా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి భారతీయుడూ దేశ భక్తుడేనని, ఏ దేశ భక్తుడినీ జాతి వ్యతిరేకుడిగా పిలువజాలరని అన్నారు. దేశంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, అంతా భయంతోనే బతుకుతున్నారన్నారు.
ప్రతిపక్ష అభ్యర్థు ఎన్నికల వ్యయంపై ఆరా తీసే ఈసీ ఇవే ప్రమాణాలు అందరికీ వర్తింపజేస్తే బీజేపీ అభ్యర్థులందరూ అనర్హులవుతారన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రాదనే విషయంపై తాను పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. కుల రాజకీయాలపై విశ్వాసం లేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ట్విటర్‌లో ఆయన స్పందించారు. ప్రజలను మతిమరుపుతో బాధపడుతున్న తెలివితక్కువ వాళ్లుగా ఆయన భావిస్తున్నారా? అని నిలదీశారు. తానో ఓబీసీని, చాయ్‌వాలా నంటూ కులం ప్రాతిపదికన ఉవ్వెత్తున ప్రచారం చేసి (2014లో) ప్రధాని అయిన ఒకేఒక్క వ్యక్తి మోదీ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment