
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా డ్రామాను బంద్ చేసి స్పీకర్‌కు నేరుగా రాజీనామా లేఖ ఇవ్వాలని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే డ్రామా కట్టిపెట్టి రాజీనామా చేయాలని సవాలు చేశారు. కొడంగల్ ప్రజలు శంకరగిరి మాన్యాలకు పంపడానికి సిద్ధంగా ఉన్నారని, ఉప ఎన్నిక వస్తే కొడంగల్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రేవంత్, ఆయన బాస్ చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ సదస్సు ఉన్నందునే జేఏసీ కొలువుల కొట్లాటకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు.
సన్‌బర్న్ షోకు అనుమతి ఇచ్చి కొలువుల కొట్లాటకు అనుమతి ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అనడం అవగాహనా రాహిత్యమని దుయ్యబట్టారు. కావాలనే కొందరు సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఈవెంట్ల నిర్వహణతో మంత్రి కేటీఆర్‌కు, ఆయన బావమరిదికి సంబంధం ఉందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని ఖండించారు.