సాక్షి, హన్మకొండ : గతంలో పార్టీ సిద్దాంతాలు, వ్యక్తుల గుణగణాలు చూసి నాయకులుగా ఎన్నుకునే వారు. డబ్బులు ఆశించే వారు కాదు. ప్రస్తుతం ఓటర్లు విలువైన ఓటును అమ్ముకోవడం బాధాకరం. నాయకులు కూడా కోట్లు కుమ్మరించి ఓట్లు కొంటున్నారు. గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ పార్లమెంట్ సభ్యుడు చందుపట్ల జంగా రెడ్డి. రాజకీయాలు ఇంతగా భ్రష్టుపట్టని కాలంలో పలుమార్లు పోటీ చేసి గెలుపోటములను చవిచూసిన ఆయన సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..
చందాలు పోగు చేసి తొలిసారి పోటీ..
ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేశాను. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలు నచ్చి, ప్రజలకు సేవ చేసేందుకు‡1965లో రాజకీయాల్లోకి వచ్చి 1967లో మొదటి సారి జనసంఘ్ పార్టీ తరçఫున పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచా. ఆ ఎన్నికల్లో నాకు రూ.5,300 ఖర్చయ్యాయి. అది కూడా స్నేహితులు, ప్రజలు చందాలిచ్చారు. అప్పట్లో కూడా ఎన్నికల ఖర్చు కొద్ది కొద్దిగా పెరిగింది కానీ... ఇంతలా పెరగడం లేదు. రెండోసారి పోటీ చేసి ఓడిపోయినప్పుడు రూ.9 వేలు ఖర్చు అయింది. మూడోసారి పోటీ చేసినప్పుడు రూ.19 వేలు ఖర్చయింది. ఇలా నేను పోటీ చేసిన రోజుల్లో ఖర్చు అంతా నామమాత్రంగానే ఉండేది.
కర్త–కర్మ–క్రియ... కార్యకర్తలే..
అప్పట్లో కార్యకర్తలు నిష్టతో, త్యాగంతో, కార్యదీక్షతో,సేవాభావంతో, పార్టీ కోసం పని చేసే వాళ్లు. పోలింగ్ రోజు నాడు కూడా కార్యకర్తలకు ఖర్చులకు డబ్బులు ఇచ్చే వారం కాదు. ఆ రోజుల్లో నాలుగు చక్రాల వాహనాలు తక్కువ. ఎక్కువగా సైకిల్, ఎడ్ల బండ్లపైనే ప్రచారం సాగేది. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే నాటికి నాలుగు చక్రాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు జీపులు, అంబాసిడర్ కారులో తిరిగి ఓటర్లను కలిసేవాళ్లం. మొదట్లో పార్టీ జిల్లాకు ఒక జీపు ఇచ్చేది. ఆ క్రమంలో వారంలో ఒకటి, రెండు రోజులు అభ్యర్ధికి వచ్చేది. జీపు రాగానే నియోజకవర్గానికి దూరంగా ఉన్న గ్రామాలకు వెళ్లే వాళ్లం.
బుర్రకధలు.. గ్రామపెద్దలు
నేడు ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే అప్పుడంతా నోటి మాట ద్వారానే ప్రచారం సాగేది. సాంస్కృతిక ప్రదర్శనలు, ముఖ్యంగా బుర్ర కథల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేవాళ్లం. నాలుగైదు గ్రామాలు కలిపి ఎన్నికల సభలు నిర్వహించేవాళ్లం. చుట్టు పక్కల గ్రామాల్లోని గ్రామ పెద్దలను, ప్రముఖులను కలిసి భవిష్యత్తు అభివృధ్ధి ప«థకాలు, ఆలోచనల గురించి చెబితే వారు గ్రామంలోని ఓటర్లకు అర్ధమయ్యేలా చెప్పి ఓట్లు వేయించేవారు. ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బులు కీలకం. టికెట్లు ఇచ్చే ముందే అభ్యర్థి డబ్బులు ఖర్చు పెడతారా లేదా అని పార్టీలు, నాయకులు చూస్తున్నారు. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వస్తూ విచ్చల విడిగా ఖర్చు పెట్టి.. గెలిచాక ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. ఇది మాబోటి వారికి ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment