కేఈ కృష్ణమూర్తి , అయ్యన్నపాత్రుడు
సాక్షి, అమరావతి/నర్సీపట్నం/సాక్షి ప్రతినిధి, కర్నూలు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడంపై తమ అధినేత, సీఎం చంద్రబాబు పంపిస్తున్న సంకేతాలు టీడీపీలో ముసలం పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేతల్లో నిరసన స్వరం వినిపిస్తుండగా.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో.. అదే పార్టీతో పొత్తుపెట్టుకోవడం, ఆ పార్టీ నేతలతో ఎన్నికల్లో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఓట్లు అడిగితే ప్రజలు సహించే పరిస్థితే లేదని పేర్కొంటున్నారు.
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి సర్వ నాశనం చేసిన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు క్షమించబోరని ఆ పార్టీ సీనియర్ నేతలు మండిప డుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లలేమని, ప్రజలు తరిమితరిమి కొడతారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ సభ్యులైన చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తిలు ఈ వ్యవహారంపై గురువారం ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, గుడ్డలూడదీసి తంతారని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించగా.. కాంగ్రెస్ దరిద్రం తమకు వద్దని ఉప ముఖ్యమంత్రి తీవ్ర స్వరంతో పేర్కొన్నారు.
కాంగ్రెస్‌తో కలిస్తే అంతకుమించిన దుర్మార్గం ఉండదు: అయ్యన్న
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపెట్టుకుంటే ప్రజలు గుడ్డలూడదీసి తంతారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటారని తాను అనుకోవట్లేదన్నారు.
అలా జరిగితే వ్యతిరేకించే మొదట వ్యక్తిని తానేనని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది. రాష్ట్రాన్ని, దేశాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేయటమే కాకుండా దోచుకుంది. దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఉండకూడదనే భావనతో ఎన్టీఆర్ పగలనక, రాత్రనక కష్టపడి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అటువంటి పార్టీతో కలిస్తే అంతకుమించిన దుర్మార్గం మరొకటి ఉండదు.
ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు తంతారు. అదే జరిగితే ప్రజలే కాదు మనం కూడా క్షమించలేం. నేను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిని. నాకు తెలిసి పార్టీలో ఇటువంటి చర్చ జరగలేదు. అటువంటి పరిస్థితి రాదు.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి వస్తే మొదట నేనే వ్యతిరేకిస్తా.. నిలదీస్తా’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో కలిసే పరిస్థితి వస్తే తమలాంటి వాళ్లం ఉండలేమని మంత్రి స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోం: డిప్యూటీ సీఎం కేఈ
మరోవైపు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం కాంగ్రెస్‌తో పొత్తుపై తన వ్యతిరేకతను బహిర్గతం చేశారు. ఆయన గురువారం కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అన్నారు. కాంగ్రెస్ దరిద్రం తమకు వద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ, జగన్.. ముగ్గురూ తమకు శత్రువులేనన్నారు. పవన్ కల్యాణ్ కూడా ఈ జాబితాలో చేరుతాడన్నారు.
ప్రజలకేం సమాధానం చెబుతాం..
కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కుదుర్చుకోవాలన్న పార్టీ అధినేత చంద్రబాబు వైఖరిపై తెలుగుదేశం శ్రేణుల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను, రాష్ట్ర నేతలపట్ల అవమానకరమైన రీతిలో వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీరామారావు ఆత్మగౌరవ నినాదంతో టీడీపీని స్థాపించారని, ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వెళ్లాలన్న ఆలోచన చేయడం ద్వారా చంద్రబాబు రాష్ట్రప్రజల ఆత్మగౌరవాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో అధినేత వైఖరిని అంతర్గత సంభాషణల్లో పార్టీ నేతలు తప్పుపడుతున్నారు.
ఇప్పటికే తెలంగాణలో ఓటుకు కోట్లు కేసు కారణంగా పార్టీని పణంగా పెట్టడమేగాక రాష్ట్ర ప్రయోజనాలను సైతం అక్కడి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు తాకట్టు పెట్టడంపై టీడీపీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ప్రత్యేక హోదాను వదులుకోవడమేగాక రాష్ట్ర విభజన చట్టంలోని అనేక హామీలు అమలుకాకున్నా నోరెత్తలేని పరిస్థితికి తెలుగుదేశాన్ని దిగజార్చారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణలో పార్టీని భూస్థాపితం చేశారని, అక్కడ కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అవుతూ ఏపీలోనూ ఆ పార్టీతో పొత్తులకు పార్టీ అధినేత ముందుకు కదులుతుండడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో తెరవెనుక లాలూచీలు నడిపించిన చంద్రబాబు ఎన్నికలప్పుడు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులను టీడీపీలో చేర్చుకోవడమేగాక వారికి టిక్కెట్లిచ్చి పార్టీని నమ్ముకున్న వారికి మొండిచేయి చూపారని అప్పట్లో అవకాశాలు కోల్పోయిన నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ టీడీపీలోకి తీసుకోవడమేగాక వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని, వాటన్నింటినీ దిగమింగుకుంటూ ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చామని వారు చెబుతున్నారు.
ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తులంటే తామే కాకుండా రాష్ట్ర ప్రజలెవ్వరూ సహించబోరని కరాఖండీగా పేర్కొంటున్నారు. అదే జరిగితే ప్రజల ముందుకెళ్లి ఓట్లు అడగలేని పరిస్థితి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేమన్నారు. గత ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్లను పార్టీలోకి తీసుకొని తమకు పోటీకి అవకాశాలు లేకుండా చేసిన అధినేత ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌తో పొత్తులంటూ సీట్లు లేకుండా చేస్తే తాము చూస్తూ ఉండాలా? అని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment