
సాక్షి, అమరావతి: గోదావరి, కృష్ణా నదుల్లో వరదల కారణంగా ఇసుక తవ్వకాలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని.. ఇవేమీ పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నిలదీశారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎత్తిన ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఇప్పటికీ దించలేదని.. మంగళవారం కూడా 55 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. కృష్ణా నదిలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఇవేమీ పవన్‌కు కనిపించడం లేదా అని విరుచుకుపడ్డారు. ‘పవన్ నాయుడూ.. నీ బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదు. అందుకే సీఎం చేస్తున్న మంచి పనుల్లో ఒక్కటి కూడా నీకు కనిపించడం లేదు.
రైతు భరోసా, వైఎస్సార్‌వాహన మిత్ర, చేనేత కార్మికులకు ఏటా రూ. 24 వేలు, మత్స్యకారులకు రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. కళ్లుండీ వీటిని చూడలేకపోతున్నావా’ అంటూ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల కష్టార్జితం రూ.1,200 కోట్లను జల్సాల కోసం దోచుకున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిని పక్కనే కూర్చోబెట్టుకుని.. కార్మికుల సంక్షేమం అంటూ పవన్ ఎలా మాట్లాడగలిగారని ఎద్దేవా చేశారు. ‘పవన్ నాయుడూ.. నువ్వు ఒక సారి తాట తీస్తాం అంటే మేం వందల సార్లు తాట తీస్తాం’ అని నాని గట్టిగా హెచ్చరించారు.
పవన్ సినిమాల్లో గబ్బర్ సింగ్ అయితే కావచ్చని.. రియల్‌గా మాత్రం రబ్బర్ సింగేనని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పినా పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. పవన్‌కే కుల జాఢ్యం ఉందని, కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కుమారుడు ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదువుతున్నాడని.. అందులో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారని.. దాని గురించి గొప్పగా చెప్పే పవన్ రాష్ట్రంలో తెలుగుకు ఏదో అయిపోతుందన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌కు పెళ్లిళ్లపై మక్కువైతే.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాసేవపై మక్కువ ఎక్కువని మంత్రి నాని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment