welfare of workers
-
వరదలు కనిపించట్లేదా పవన్ నాయుడూ..
సాక్షి, అమరావతి: గోదావరి, కృష్ణా నదుల్లో వరదల కారణంగా ఇసుక తవ్వకాలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని.. ఇవేమీ పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నిలదీశారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎత్తిన ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఇప్పటికీ దించలేదని.. మంగళవారం కూడా 55 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. కృష్ణా నదిలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఇవేమీ పవన్‌కు కనిపించడం లేదా అని విరుచుకుపడ్డారు. ‘పవన్ నాయుడూ.. నీ బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదు. అందుకే సీఎం చేస్తున్న మంచి పనుల్లో ఒక్కటి కూడా నీకు కనిపించడం లేదు. రైతు భరోసా, వైఎస్సార్వాహన మిత్ర, చేనేత కార్మికులకు ఏటా రూ. 24 వేలు, మత్స్యకారులకు రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. కళ్లుండీ వీటిని చూడలేకపోతున్నావా’ అంటూ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల కష్టార్జితం రూ.1,200 కోట్లను జల్సాల కోసం దోచుకున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిని పక్కనే కూర్చోబెట్టుకుని.. కార్మికుల సంక్షేమం అంటూ పవన్ ఎలా మాట్లాడగలిగారని ఎద్దేవా చేశారు. ‘పవన్ నాయుడూ.. నువ్వు ఒక సారి తాట తీస్తాం అంటే మేం వందల సార్లు తాట తీస్తాం’ అని నాని గట్టిగా హెచ్చరించారు. పవన్ సినిమాల్లో గబ్బర్ సింగ్ అయితే కావచ్చని.. రియల్‌గా మాత్రం రబ్బర్ సింగేనని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పినా పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. పవన్‌కే కుల జాఢ్యం ఉందని, కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కుమారుడు ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడని.. అందులో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారని.. దాని గురించి గొప్పగా చెప్పే పవన్ రాష్ట్రంలో తెలుగుకు ఏదో అయిపోతుందన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌కు పెళ్లిళ్లపై మక్కువైతే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజాసేవపై మక్కువ ఎక్కువని మంత్రి నాని స్పష్టం చేశారు. -
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, న్యూఢిల్లీ: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన కార్మిక మండలి సమావేశంలో నాయిని పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..11 లక్షల మంది కార్మికులు, 312 ప్రభుత్వ సంస్థలు, 10,012 ప్రైవేటు సంస్థలు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మిక మండలిలో నమోదు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు వివాహ కానుకలు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు ప్రకటించిందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల ఆర్థిక సాయం, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.60 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో పలు రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. -
కార్మికుల సంక్షేమమే ధ్యేయం
► మెకానిక్‌ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం ► ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీ నారదాసు కరీంనగర్: బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు కార్మికుల సమగ్రాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు అన్నారు. ఆదివారం పట్టణంలోని బైపాస్‌రోడ్‌లో గల ఎల్లమ్మ గుడి వద్ద ఆల్ టూవీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. మెకానిక్‌ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లుతానని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానన్నారు. మెకానిక్‌లకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో పాటు కార్మిక సంక్షేమ శాఖ నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు విషయంతో పాటు హెల్త్‌కార్డులు అందేలా చొరవ చూపుతానన్నారు. మెకానిక్‌ల కమ్యూనిటీ హాల్ కోసం ఇప్పటికే 3 లక్షలు కేటాయించానని, భవన నిర్మాణం చేపడితే ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి మరో 30 లక్షల రూపాయల కేటాయిస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలోనగర మేయర్ రవీందర్‌సింగ్, ఆల్ టూవీలర్స్ మెకానిక్ వెల్పేర్ సోసైటీ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు, గౌరవ అధ్యక్షుడు గజ్జెల స్వామి, కార్పొరేటర్లు ఎల్.రూప్సింగ్, కంసాల శ్రీనివాస్, మహ్మద్ అరీఫ్, మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య, ఏఎంసీ చైర్మన్ ముల్కల గంగారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కె ఖాజా అలీమొద్దీన్, ఎండీ అఫ్రోజ్, మల్లిఖార్జున్, వినోద్‌కుమార్, శ్రీను, నరేశ్, ఆంజనేయులు, ముజాహిద్‌తో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున మెకానిక్‌లు పాల్గొన్నారు.